
డీసీసీబీ రుణ లక్ష్యం రూ.600 కోట్లు
ఉప్పునుంతల: ఈ ఆర్థిక సంవత్సరంలో డీసీసీబీ ద్వారా రూ.600 కోట్ల రుణాలు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక పీఏసీఎస్‌లో చైర్మన్ సత్తు భూపాల్‌రావుతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సంఘ సభ్యులు తమ పూర్తి సహకారాన్ని అందజేసి రైతులకు పంట, ఇతర రుణాలు అందించేలా చూడాలని సూచించారు. అలాగే స్థానిక పీఏసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ సమస్యలతో ఓటీఎస్ ద్వారా రైతుల నుంచి కొంత అధికంగా రుణ బకాయిలు వసూలు చేశామని.. జరిగిన పొరపాటును సరిచూసుకున్న వెంటనే వసూలు చేసిన ఎక్కువ డబ్బులను మార్చిలోనే తిరిగి వారి సొంత ఖాతాలో జమ చేశామని, ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని వివరించారు. నాబార్డ్, టెస్కాబ్ రుణాలు పొందాలంటే రుణ రికవరీ శాతం పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందుకోసం డీసీసీబీకి రూ.21 కోట్లు నష్టం వాటిల్లినా.. ఓటీఎస్ ద్వారా మొండి బకాయిలు వసూలు చేసినట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న 78 సహకార పరపతి సంఘాల్లో 39 సంఘాలు మాత్రమే 50 శాతం మేర రుణాలను రికవరీ చేసేవని.. ఓటీఎస్‌తో మరో 16 సంఘాలు రుణ రికవరీ శాతం 50 శాతం దాటిందని వివరించారు. సమావేశంలో డీసీసీబీ సీఈఓ పురుషోత్తం, అచ్చంపేట డీసీసీబీ మేనేజర్ రవికుమార్, పీఏసీఎస్ సీఈఓ రవీందర్‌రావు పాల్గొన్నారు.