కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్‌లో భాగంగా పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఎన్‌కౌంటర్లలో మృతి చెందారు. దళాలకు దళాలే మృత్యువాత పడగా.. మరికొందరు అగ్రనేతలు, మావోయిస్టుల ఆయుధాలతో సహా లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చి 31 టార్గెట్‌గా చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ పూర్తయిన సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్ట్ అగ్రనేతలు ముప్పాల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి, పొలిట్‌బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రాతో పాటు పసునూరి నరహరి అలియాస్ సంతోశ్ పేరును కూడా కేంద్రం ప్రకటించింది. ఇటీవల కాలంలో పోలీస్ కూంబింగ్‌లు మరింత ఉధృతంగా సాగుతున్న తరుణంలో కేంద్ర కమిటీ సభ్యుడు, జార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగం ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, అలియాస్ సంతోశ్ మంగళవారం భార్యతో కలిసి తెలంగాణ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. కాగా, ఉమ్మడి వరంగల్ నుంచి ఇంకా ఐదారుగురు మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్నట్లు ప్రచారం ఉన్నా.. పోలీసు రికార్డుల్లో మాత్రం లేరు. దీంతో ఉమ్మడి వరంగల్ నుంచి పోలీసు రికార్డుల్లో కీలక నేతగా ఉన్న పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, సంతోశ్ లొంగుబాటు చివరిదిగా చెబుతున్నారు. అజ్ఞాత మావోయిస్టుల జాబితాలో ఉన్న నరహరి జనజీవన స్రవంతిలో కలవడంతో నక్సల్స్ రహిత జిల్లాగా మారిందంటున్నారు.


