ఖరీఫ్ ప్రణాళిక ఖరారు చేసిన అధికారులు
ములుగు: జిల్లాలో రాబోయే వానాకాలం (ఖరీఫ్ సీజన్)కు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు సమగ్ర ప్రణాళికను ఖరారు చేశారు. ఈ ఏడాది మొత్తం 1,63,229 ఎకరాల్లో వివిధ పంటలు సాగుకానున్నట్లు అధికారులు అంచనా వేశారు. జూన్ నెలలో ప్రారంభమయ్యే ఖరీఫ్ సాగును దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అధికారులు విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. జిల్లాలో వివిధ పంటల సాగుకు 29,336 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని గుర్తించారు. ప్రస్తుతం 14,159 క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉన్నాయి. మిగతా విత్తనాలను త్వరితగతిన విడతల వారీగా సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
10 మండలాలు.. 1,63,229 ఎకరాలు
జిల్లాలోని 10 మండలాల పరిధిలో 1,63,229 ఎకరాల్లో వానకాలం పంటల సాగు కానున్నట్లు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 1,07,700 ఎకరాల్లో వరి, 28,600 ఎకరాల్లో పత్తిపంట, 11,329 ఎకరాల్లో మొక్కజొన్న, 14,500 ఎకరాల్లో జీలుగ, 1,100 ఎకరాల్లో జనుము పండించనున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం 26,925 క్వింటాళ్ల వరి విత్తనాలు, 906 క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనాలు, 1,450 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు, 55 క్వింటాళ్ల జనుము విత్తనాలు, 54,286 పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరమున్నట్లు అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వ సెక్టార్లలో 6,350 క్వింటాళ్ల విత్తనాలు, ప్రైవేటు సెక్టార్లలో 7,809 క్వింటాళ్ల విత్తనాలతో పాటు 28,150 పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు పేర్కొంటున్నారు. పంటల సాగుకు 17,504 మెట్రిక్ టన్నుల యూరియా, 10 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ, 8 వేల మెట్రిక్ టన్నుల ఎంఓపీ ఎరువులు అవసరమున్నట్లు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
జిల్లాలో 1,63,229 ఎకరాల్లో సాగుకానున్న పంటలు
29,336 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా
అందుబాటులో
14,159 క్వింటాళ్ల విత్తనాలు
భూములు సిద్ధం చేస్తున్న రైతులు
వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే భూముల్లోని పత్తి, మిర్చి పొరకలను తొలగిస్తూ సాగుకు రెడీ చేస్తున్నారు. మరో 20 రోజుల్లో వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో విత్తనాలను, ఎరువులను ముందస్తుగా నిల్వ చేసుకునేలా సన్నహాలు చేస్తున్నారు. ప్రతిఏటా పంటలు పండిస్తున్నా అతివృష్టి, అనావృష్టి కారణంగా అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈసారైనా మంచి దిగుబడులు రావాలని రైతులు ఆశిస్తూ ముందుకు సాగుతున్నారు. పంటల దిగుబడి పెరిగేలా వ్యవసాయ శాఖ అధికారులు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ, సమయానికి విత్తనాలు, ఎరువులు అందించాలని రైతులు కోరుతున్నారు.
విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాం..
జిల్లాలో వానాకాలం సాగుకు ప్రణాళికలు రూపొందించాం. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి. విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జిల్లాలో రాబోయే ఖరీఫ్ సీజన్‌లో 1,63,229 ఎకరాల్లో పంటలు సాగుకానున్నాయి. రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
– సురేశ్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి


