ఏటూరునాగారం: జిల్లాలోని గిరిజన గురుకుల కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదవనున్న గిరిజన విద్యార్థులకు ఈ నెల 16, 18వ తేదీల్లో రెండు రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు గురుకులాల జిల్లా సమన్వయ అధికారి(డీసీఓ) శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏటూరునాగారం టీజీటీడబ్ల్యూఆర్‌జేసీ (బాలుర) కళాశాలలో ఈనెల 16న బాలురకు, టీజీటీడబ్ల్యూఆర్‌జేసీ (బాలికల) కళాశాలలో చేరేందుకు ఈ నెల 18న బాలికలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డీసీఓ పేర్కొన్నారు. బాల బాలికలు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ పత్రాతలతో హాజరు కావాలని కోరారు. 2025–26 విద్యాసంవత్సరంలో ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత పొందిన వారు మాత్రమే అర్హులని తెలిపారు.
‘కేసులు నమోదు చేయాలి’
వెంకటాపురం(కె): ఏజెన్సీలో ఆదివాసీలపై దాడులకు పాల్పడిన గిరిజనేతరులపై కేసులు నమోదు చేయాలని గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాయం సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయిలు తెలిపారు. మండలకేంద్రంలో గొండ్వానా సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీలపై దాడి చేసిన గిరిజనేతరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో లొసుగులు తెలుసుకుని శిక్ష తగ్గించే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏజెన్సీలో ఆదివాసీలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇరుప ప్రకాశ్, పూనెం వరప్రసాద్, రవి, అశోక్, బన్ని తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి క్వార్టర్స్‌లో చోరీ
గణపురం: మండలంలోని 1000 క్వార్టర్స్‌లో ఒకే రాత్రి 8 ఇళ్లలో చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గణపురం మండలం 1000 క్వార్టర్స్‌లో సింగరేణి ఉద్యోగులు నివాసం ఉంటున్నారు. వేసవి సెలవులు కావడంతో వారి స్వగ్రామాలకు వెళ్లారు. ఇది గమనించిన దుండగులు పక్కా ప్రణాళికతో శనివారం రాత్రి 8 క్వార్టర్ల తాళాలు పగులగొట్టి చోరీకి యత్నించారు. ఆదివారం ఉదయం తోటి ఉద్యోగులు గమనించి బాధితులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్‌టీంతో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. బ్లాక్ నంబర్ 34 రూం నంబర్ 128లో నివాసముంటున్న మల్లగాని సరస్వతికి చెందిన 3 తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు, గాజుల వెంకటేశ్వర్లు 5 గ్రాముల బంగారు కమ్మలు, 4 గ్రాముల వెండి, రూ.6వేల నగదు, పాతరవేని రాజేష్‌కు చెందిన 2 గ్రాముల బంగారం, 4 తులాల వెండి, వేములపల్లి బాబురావు క్వార్టర్‌లో 10 తులాల వెండితో పాటు రూ. 1000 నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. సింగరేణి సెక్యూరిటీ ఉండి, నిత్యం జనాభాతో ఉండే 1000 క్వార్టర్లలో చోరీ జరగడం సంచలనం సృష్టించింది. పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి
భూపాలపల్లి అర్బన్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. బాలికపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ బీజేపీ నాయకత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు ఆయన ఎంపీ, మంత్రి పదవులకు రాజీనామా చేసి విచారణకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీను, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు భువనసుందర్, వెంకీయాదవ్, దేవన్, లక్ష్మి, పరమేశ్వరి, అజ్మీర జంపన్న, రమేష్, హఫీజ్, రాధా, ప్రేమ్‌కుమార్, నాగరాజు, కిషోర్, భిక్షపతి, పొనగంటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.


