● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు: ములుగు సాంస్కృతిక వైభవం ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, ఈ నెల 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ములుగు సాంస్కృతిక వైభవం ఉత్సవాల నిర్వహణపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఉత్సవాల షెడ్యూల్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ములుగు సాంస్కృతిక వైభవం ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో, జెడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాల, బాలికల పాఠశాలల్లో ఈ నెల 20, 21,22 తేదీలలో మూడు రోజుల పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ స్టాల్స్, గిరిజన నృత్యాలు, కవి సమ్మేళనం అంశాలతో పాటు ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా కలెక్టర్ జిల్లా కేంద్రంలోని తాత్కాలిక బస్టాండ్ ఆవరణ పరిసరాలను, ములుగు మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రకృతి వనాన్ని, చలి వేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఈవీఎం గోదాంను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నెలవారి తనిఖీ నిర్వహించారు. గోదాంలో అమర్చిన సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక పరికరాలను తనిఖీ చేశారు.
నేడు సర్పంచ్‌లు, కౌన్సిలర్లకు శిక్షణ
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్య వారోత్సవాల్లో భాగంగా పాఠశాల విద్య కార్యక్రమాలపై సర్పంచులకు, కౌన్సిలర్లకు నేడు(బుధవారం) ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సహదేవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు బుధవారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఒక్క రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు.


