● ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి
ములుగు: జిల్లాలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో కొనసాగుతున్న పలు విద్యుత్ అభివృద్ధి పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ములుగులో కొత్తగా నిర్మిస్తున్న డిపార్ట్‌మెంటల్ ఎస్‌పీఎం షెడ్ పనులు, ప్రైవేట్ ఎస్‌పీఎం షెడ్‌ను సందర్శించారు. ఫెయిల్యూర్ ట్రాన్స్‌ఫార్మర్ల రికార్డులు, నిర్వహణ విధానం, పనితీరును పరిశీలించారు. ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల ప్రక్రియను మరింత వేగవంతం చేసి రోలింగ్ స్టాక్ పెంచుకోవాలని సూచించారు. 33కేవీ కొత్త లైన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు 33కేవీ లైన్ సుమారు 27 కిలోమీటర్ల అటవీ ప్రాంతం మీదుగా కర్లపల్లి సబ్ స్టేషన్ నుంచి లింగాల కొత్త సబ్‌స్టేషన్‌కు కలుస్తుందని అధికారులు సీఎండీకి వివరించారు. అదేవిధంగా పస్రా సెక్షన్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న సెక్షన్ ఆఫీస్ పనులను పరిశీలించి, ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. 33/11 కేవీ లింగాల నూతన సబ్‌స్టేషన్ ఏర్పాటుతో గుండాల, కొడిశెల, లింగాల పరిసర గ్రామాలకు విద్యుత్ సరఫరా మరింత మెరుగ్గా అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎండీ వెంట సీఈ రాజుచౌహన్, ఎస్‌ఈ బేతి భిక్షపతి, ములుగు డీఈ (ఆపరేషన్) నాగేశ్వర్ రావు, డీఈలు పురుషోత్తం, సదానందం, ఈఈ వెంకట్రాం, ఏడీఈలు ప్రణయ్, సందీప్ పాటిల్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.


