● రాష్ట్ర సెన్సెస్ ఆపరేషన్ జేడీ సుబ్బరాజు
ములుగు: మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న ఇళ్ల గణనలో తప్పులు లేకుండా సర్వే పూర్తి చేయాలని ఎన్యుమరేటర్లకు రాష్ట్ర సెన్సెస్ ఆపరేషన్ జాయింట్ డైరెక్టర్ సుబ్బరాజు సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మున్సిపాలిటీలోని సూపర్‌వైజర్ సర్కిల్‌లో సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్లు ఇంటి నంబర్లను ఎలా కేటాయిస్తున్నారో, పని సక్రమంగా జరుగుతుందో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతీ ఇంటి నంబర్ ఎదురుగా శ్రీసీఎన్‌శ్రీ అని తప్పనిసరిగా రాయాలని సూచించారు. మ్యాపింగ్ ఎలా చేస్తున్నారో కూడా ఆయన ఆరా తీశారు. సర్వేలో వేగం పెంచాలని తెలిపారు. ఎన్యుమరేటర్లకు కేటాయించిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ హెచ్‌ఎల్‌బీ పరిధిని స్పష్టంగా తెలియజేసేందుకు మున్సిపాలిటీ నుంచి మూడు రోజుల పాటు సిబ్బందిని వారి వెంట పంపించాలని ఆదేశించారు. జిల్లాలోని ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు బుధవారం సాయంత్రంలోపు తమకు కేటాయించిన ప్రతీ ఇంటికి ఇంటి నంబర్లు వేయడం పూర్తి చేయాలని సూచించారు. వచ్చే నెల 9వ తేదీ వరకు సర్వే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. రోజువారీ పనితీరుపై మానిటరింగ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెన్సెస్ ఇన్‌చార్జ్ వినయ్, ములుగు సీపీవో, జిల్లా సెన్సెస్ అధికారి ఎం.ప్రకాశ్, మున్సిపాలిటీ చార్జ్ ఆఫీసర్ కమిషనర్ సంపత్, స్టాటిస్టికల్ ఆఫీసర్ బి.లాల్‌నాయక్, ఫీల్డ్ ట్రైనర్లు, సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.


