ములుగు: ఎన్యుమరేటర్లు జనగణనలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. ములుగు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించనున్న జన గణన హౌస్ లిస్టింగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సన్నాహక సమావేశాన్ని సోమవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్ తెలిపారు. జనగణన కార్యక్రమం ప్రాముఖ్యత, ఇంటింటి వివరాల సేకరణ విధానం, హౌస్ లిస్టింగ్ ప్రక్రియ, ప్రజలతో సమన్వయం, ఖచ్చితమైన సమాచార సేకరణపై అధికారులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ప్రతీ కుటుంబం వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. జనగణన ప్రక్రియ దేశాభివృద్ధి ప్రణాళికలకు ఎంతో కీలకమని, ప్రజలందరూ అధికారులకు సహకరించి సరైన సమాచారం అందించాలని తెలిపారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకున్న వారు వారి ఐడీని వచ్చిన అధికారులకు చూపించి వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్యూమరేటర్లు, మాస్టర్ ట్రైనర్ ఎండి.హమీద్, ఫీల్డ్ ట్రైనర్ మధుసూధన్ పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు
ములుగు: కలెక్టర్ హేమంత్ సహదేవరావును ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ ఆధ్వర్యంలో సభ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్స్ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్టినట్లు ప్రవీణ్ తెలిపారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీనిచ్చినట్లు వెల్ల డించారు. ఈ కార్యక్రమంలో ములుగు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి సహోదర రెడ్డి, కోశాధికారి ఎలగందుల మోహన్, ఉపాధ్యక్షులు కాసిడి సుదర్శన్ రెడ్డి, సహాయ కార్యదర్శి డేగల భద్రయ్య, గౌరవ సలహాదారుడు రామిని శ్రవణ్ కుమార్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మ్యూజియంలోకి పురాతన విగ్రహాలు
కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21నుంచి జూన్1వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది అంత్యపుష్కరాలకు ముందుగానే మ్యూజియం ప్రారంభించాలనే ఉన్నతాధికారుల ఆదేశాలతో నిర్మాణం పూర్తికాక ముందే హడావుడిగా పురాతన విగ్రహాలను అమర్చుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం అధికారులు పురాతన విగ్రహాలను మ్యూజియంలో అమర్చారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు కాకతీయులు, చాళుక్యులనాటి ప్రాంతీయ చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపడుతున్నప్పటికీ పూర్తిస్థాయి పనులు కాకముందే విగ్రహాల ఏర్పాటు చేపట్టడంపై స్థానికుల్లో చర్చ జరుగుతోంది.
ఏరియా బీసీ, ఓబీసీ లైజనింగ్ ఆఫీసర్‌గా మురళీమోహన్
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియా సింగరేణి బీసీ, ఓబీసీ లైజనింగ్ ఆఫీసర్‌గా ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ సిలివేరి మురళీమోహన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం జీఎం కార్యాలయ చాంబర్‌లో సింగరేణి బీసీ ఓబీసీ జనరల్ సెక్రటరీ నల్లపురి రమేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ఏరియాల లైజనింగ్ ఆఫీసర్లు, నాయకులు పాల్గొని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఏరియా జనరల్ మేనేజర్ లైజనింగ్ ఆఫీసర్‌గా నియమితులైన మురళీమోహన్‌ను అభినందిస్తూ శాలువాతో సన్మానించారు.


