వినతులిచ్చాం.. పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

వినతులిచ్చాం.. పరిష్కరించండి

May 12 2026 12:56 AM | Updated on May 12 2026 12:56 AM

ప్రజావాణిలో 67, గిరిజనదర్బార్‌లో 23 అర్జీల రాక

ములుగు రూరల్‌/ఏటూరునాగారం: ప్రజావాణి, గిరిజన దర్బార్‌లో అందజేసిన వినతులను పరిష్కరించాలని బాధితులు అధికారులను కోరారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 67 వినతులు రాగా గిరిజన దర్బార్‌లో 23 వినతులను సమర్పించారు. ఈ మేరకు గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు అర్జీలు స్వీకరించగా ఐటీడీఏలో పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పొ అర్జీలు స్వీకరించారు. అర్జీలను పరిశీలించి పెండింగ్‌లో లేకుండా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ములుగు డివిజన్‌ స్థాయిలో నిర్వహించిన ప్రజావాణిలో ఆర్డీఓ వెంకటేశ్‌ ఫిర్యాదులను స్వీకరించారు.

గిరిజన దర్బార్‌లో వచ్చిన వినతుల వివరాలు..

గోవిందరావుపేట మండలం బాలాజీ నగర్‌(కర్లపల్లి) గ్రామంలో గిరివికాసం పథకంలో బోరు, మోటారు ఇప్పించాలని విన్నవించారు. మంగపేట మండలం మల్లూరు గ్రామంలో 2023లో భూమి సర్వే చేపట్టి అర్హురాలిగా ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు పట్టాదారు పాస్‌పుస్తకం రాలేదని విన్నవించారు. మంగపేట మండలం మల్లూరు నుంచి గ్రౌండ్‌ వాటర్‌ బోరు మంజూరు చేయాలని కోరారు. ఏటూరునాగారం మండలం ఆకులవారిఘణపురం గ్రామానికి చెందిన నాయకపోడు నాయకులు మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి ఆలయం సమీపంలో ఉన్న ఆదివాసీ నాయకపోడులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఎస్‌ఎస్‌తాడ్వాయి మండల కేంద్రంలో 1/70 చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులు చేసిన భూ కబ్జా, అక్రమ కట్టడాలను నిలిపివేయాలని గిరిజనులు పీఓకు విన్నవించారు. ఇలా పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాధితులు పీఓకు వినతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ గంటా ప్రతాప్‌, డీడీ జనార్దన్‌, ఏఓ రాజ్‌కుమార్‌, ఎస్‌ఓ సురేశ్‌బాబు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్‌, మేనేజర్‌ శ్రీనివాస్‌, జియాలజిస్ట్‌ కిశోర్‌, ఐటీఐ ప్రిన్సిపాల్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

స్వీకరించిన కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు, ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పొ

పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు

Advertisement
 
Advertisement
Advertisement