మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి

May 12 2026 12:56 AM | Updated on May 12 2026 12:56 AM

ములుగు: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా తాజా ఓటరు జాబితాను ఎస్‌ఐఆర్‌ జాబితాతో మ్యాపింగ్‌ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ ఆఫీసర్‌ సుదర్శన్‌ రెడ్డి ఓటరు జాబితా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌పై సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు హాజరయ్యారు. అనంతరం ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో రాబోయే 15 రోజుల్లో కనీసం 90 శాతం మ్యాపింగ్‌ పూర్తి చేయాలని సూచించారు. స్టేషన్‌ ఘన్‌న్‌పూర్‌, అశ్వారావుపేట వంటి నియోజకవర్గాలు ఇప్పటికే 80 శాతానికి పైగా మ్యాపింగ్‌ పూర్తి చేశాయన్నారు. ఒడిశా రాష్ట్రం ఇప్పటికే 90 శాతం, కర్ణాటక 81 శాతం, మహారాష్ట్ర 68 శాతం మ్యాపింగ్‌ పూర్తి చేశాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉందని పేర్కొన్నారు. జిల్లా ఎన్నికల అధికారులు తమ బృందాలను ప్రోత్సహించి మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. మ్యాపింగ్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధుల పాత్ర కేవలం ఇళ్ల గుర్తింపు, వ్యక్తుల గుర్తింపుకు మాత్రమే పరిమితం కావాలని స్పష్టం చేశారు. ప్రైవేట్‌ వ్యక్తులు ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ నిర్వహిస్తున్నారనే భావన ప్రజల్లో కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ కోసం అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లను అన్ని వనరుల నుంచి గుర్తించి నియమించుకోవాలని ఆదేశించారు. ఎస్‌ఐఆర్‌ ప్రారంభమైన తర్వాత ప్రతిరోజూ ఫారాల పంపిణీ, సేకరణపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. అనంతరం కలెక్టర్‌ సహదేవరావు మాట్లాడుతూ జిల్లాలో ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బీఎల్‌ఓల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ లక్ష్యాలకు అనుగుణంగా మ్యాపింగ్‌ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలతో సమన్వయం చేసుకుంటూ పారదర్శకంగా ప్రక్రియ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అర్హత ఓటరు పేరు సక్రమంగా మ్యాపింగ్‌ అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీసీలో ఆర్డీఓ వెంకటేశ్‌, ఎలక్షన్‌ సూపరింటెండెంట్‌ ఎండి సలీం, డిప్యూటీ తహసీల్దార్‌ నితీష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

‘దోస్త్‌’ పోస్టర్‌ ఆవిష్కరణ

ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల దోస్త్‌ అడ్మిషన్‌ పోస్టర్‌ను తన ఛాంబర్‌లో కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ వరకు ఎడ్యుకేషన్‌ వీక్‌ను ఘనంగా నిర్వహించాలని, కళాశాలలో అడ్మిషన్లు పెంచేందుకు ప్రతీ అధ్యాపకుడు కృషి చేయాలని సూచించారు.

వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement