మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఆంజనేయస్వామి భక్తులతో సోమవారం కిటకిటలాడింది. నేడు(మంగళవారం) హనుమాన్ జయంతి కావడంతో మండలం, అర్ధ మండలం దీక్ష చేపట్టిన భక్తులు స్వామివారికి ఇరుముడి సమర్పించి దీక్ష విరమించనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయానికి వెళ్లే భక్తులు మార్గమధ్యలోని లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భారీగా తరలిరావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. స్వయంభు స్వామివారిని దర్శించుకునేందుకు సాధారణ భక్తులు సైతం భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు గంటల కొద్ది బారులుదీరారు. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు పవన్‌కుమార్ ఆచార్యులు, ఏడనూతుల ఈశ్వర్‌చంద్ రామా నుజందాస్, భక్తుల గోత్రనామాలతో స్వామి వారికి అర్చనలు జరిపించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.


