● జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి
ములుగు: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహిద్దామని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి విద్యాశాఖ అధికారులకు పిలుపునిచ్చారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా మొదటి రోజు పీఎంశ్రీ పాఠశాలలైన బండారుపల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్, జవహర్‌నగర్ కస్తూర్బా గాంధీ విద్యాలయం, పస్రా నాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఏటూరునాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రాజుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6నుంచి 9వ తరగతుల విద్యార్థులకు సమ్మర్ క్యాంపులు ప్రారంభించినట్లు తెలిపారు. రెండో రోజు పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ కోసం జిల్లాలోని బండారుపల్లి మోడల్ స్కూల్, ఏటూరునాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. మూడోరోజు గ్రామ సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు విద్యాశాఖలో నిర్వహించనున్న విద్యా కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించనున్నట్లు వివరించారు. నాల్లో రోజు ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఐదో రోజు గ్రంథాలయ దినోత్సవం నిర్వహించాలని, ఆరో రోజు కళలు, సాంస్కృతిక దినోత్సవం, ఏడో రోజు విద్యా దినోత్సవం నిర్వహించి క్షేత్రస్థాయిలో విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాలని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులను కోరారు.


