ములుగు రూరల్: వేసవి దృష్ట్యా నూతనంగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మున్సిపాలిటీ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని తాగునీటి సరఫరా, సమస్యలపై ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో శనివారం ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించగా పలు వార్డుల నుంచి ప్రజలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ సానుకూలంగా స్పందించారు. మున్సిపాలిటీలో నూతనంగా ఏర్పాటు అయిన కాలనీల్లో మిషన్ భగీరథ పైపులైన్ల ఏర్పాటుతో పాటు ఆన్‌ఆఫ్ ఏర్పాటు చేయాలని, చేతి పంపులు, పైపులైన్ల మరమ్మతులు, వాటర్ ట్యాంకుల క్లీనింగ్ వంటి సమస్యలపై ప్రస్తావించారు. ముఖ్యంగా 9వ వార్డులో నీటి సమస్య ఎక్కువగా ఉన్నట్లు సమస్యలు వెల్లువెత్తాయి.
ప్రశ్న: మిషన్ భగీరథ నీరు రావడం లేదు.
– తక్కపల్లి రమ, కృష్ణాకాలనీ
జవాబు: మున్సిపాలిటీ పరిధిలో మిషన్ భగీరథ నీటిని రోజు మార్చి రోజు అందిస్తున్నాం. కాలనీల్లో ఏదైనా పైపులైన్ సమస్య ఉంటే తప్పా నీటి సరఫరా నిలిపివేయడం జరగదు. సిబ్బందిని కాలనీకి పంపించి సమస్యను పరిష్కరిస్తాం.
ప్రశ్న: నల్లా నీళ్లు చివరి వరకు రావడం లేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నాం.
– తడక సుధాకర్, 9వ వార్డు
జవాబు: నల్లా నీటిని సరఫరా చేస్తున్న క్రమంలో సంపుల్లో మోటర్లు ఏర్పాటు చేయడం, పైపులైన్ బాల్స్ తొలగించడం కారణంగా నీరు చివరి వరకు అందకపోవచ్చు. అలాంటి సమస్యలు ఉండి ఉంటే సిబ్బందిని పంపి నల్లా కనెక్షన్లను పరిశీలించి మోటర్లు బిగించిన వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం. పైపులైన్ చివరి వరకు తాగునీరు అందిస్తాం.
ప్రశ్న: మిషన్ భగీరథ నీరు వారం రోజులగా రావడం లేదు.
– ఒజ్జల కుమార్, 18 వార్డు
జవాబు: గొల్లవాడలో మిషన్ భగీరథ పైపులైన్ల మరమ్మతుల కారణంగా మిషన్ భగీరథ నీరు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పైపులైన్ల మరమ్మతులు పూర్తి అయ్యాయి. నీటిని నేటి నుంచి సరఫరా చేస్తాం.
ప్రశ్న: కాలనీలో మిషన్ భగీరథ పైపులైన్ ఏర్పాటు చేయించాలి.
– బండి రవి, 7వ వార్డు
జవాబు: మిషన్ భగీరథ పైపులైన్ పనులు మున్సిపాలిటీ పరిధిలో కొంత మేరకు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కొన్ని కాలనీలకు మిషన్ భగీరథ పైపులైన్లు లేని కారణంగా తాగునీటిని సరఫరా చేయలేకపోతున్నాం. పైపులైన్ లేని కాలనీలను వెంటనే గుర్తించి నూతన పైపులైన్లు ఏర్పాటు చేయిస్తాం.
ప్రశ్న: పబ్లిక్ నల్లాలకు ఆన్‌ఆఫ్ లేకపోవడంతో నీరు వృథాగా పోతుంది.
– దయాకర్, కృష్ణాకాలనీ
జవాబు: కాలనీలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పబ్లిక్ నల్లాలకు ఆన్ ఆఫ్ ఏర్పాటు చేయలేదు. దీంతో పలు చోట్ల నీరు వృథాగా పోతుంది. వెంటనే ఆన్‌ఆఫ్ ఏర్పాటు చేసి నీటిని వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న: నల్లాపైపులు రోడ్డు పక్కన ఉండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
– అన్నం మోహన్‌కుమార్, 9వ వార్డు
జవాబు: రోడ్డు అంచున ఉన్న నల్లా పైపులను మరింత భూమి లోపలి నుంచి వేయించి పైపులైన్ పాడుకాకుండా చూస్తాం. నల్లా కనెక్షన్లు ఉన్న చోట వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలి. పైపులైన్ పైనుంచి భారీ వాహనాలు వెళ్తే పైపులు దెబ్బతిని నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది.
మున్సిపాలిటీలో ప్రతిరోజూ నీరందించేందుకు పాటుపడుతా
నూతన కాలనీల్లో పైపులైన్ల ఏర్పాటుకు పనులు చేయిస్తా
మున్సిపాలిటీ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ
సాక్షి ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన


