12 రోజులు ఆధ్మాత్మిక శోభ | - | Sakshi
Sakshi News home page

12 రోజులు ఆధ్మాత్మిక శోభ

May 10 2026 7:40 AM | Updated on May 10 2026 7:40 AM

కాళేశ్వరం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఈనెల 21నుంచి జూన్‌ 1వ తేదీ వరకు ఆధ్యాత్మిక శోభతో మారుమోగనుంది. గతేడాది జరిగిన సరస్వతీనది ఆది పుష్కరాల మాదిరిగానే 12రోజుల పాటు అంత్య పుష్కరాలకు రోజుకొకరు చొప్పున పలువురు పీఠాధిపతులు రానున్నారు. పలువురు ప్రవచన కర్తలు తమ సందేశాన్ని భక్తులకు వినిపించనున్నారు. ప్రతీ రోజు అతిఽథుల సూచనల ప్రకారం హోమాలు నిర్వహిస్తారని ఆలయవర్గాలు తెలిపాయి. ప్రతీ రోజు కాశీపండితులతో గోదావరి హారతి, అనంతరం తెప్పోత్సవం నిర్వహిస్తారు.

పీఠాధిపతులు వీరే..

సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా ప్రతీ రోజు పీఠాధిపతులు పుష్కర స్నానం చేసి శ్రీకాళేశ్వరముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీస్వామిగల్‌, నాసిక్‌ పీఠాధిపతి మహామండలేశ్వర ఆచార్య సంవిదానంద సరస్వతీమహారాజ్‌, శంకరాచార్య మహాసంస్థానం శ్రీ అద్వైతానంద భారతి, శ్రీశ్రీ అవని శృంగేరి జగద్గురువులు, ఆదిలాబాద్‌ పీఠం శ్రీ యోగానంద సరస్వతీస్వామీజీ, హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామి, శ్రీ దత్త గిరి మహారాజ్‌ ఆశ్రమం పీఠాధిపతి బర్దీపూర్‌ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్‌, విజయనగరం, కర్ణాటకకు చెందిన చింతామణి మఠం శివానంద భారతి చింతామణి స్వామి, చింతామణి మఠం, విశాఖపట్నం శారద పీఠం స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి, మెదక్‌ కొల్చారం మాధవానంద సరస్వతి రానున్నారు.

ప్రవచన కర్తలు:

21 నుంచి 24 వరకు శృంగేరి శారదా పీఠ ఆస్థాన పౌరాణికులు, బాచంపల్లి సంతోష్‌ కుమార్‌ శాసీ్త్రతో పుష్కర వైభవ ప్రవచనం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు. 23న మహాసహస్రావధాని గరికపాటి నరసింహరావుతో ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తారు. జూన్‌ 1న బ్రహ్మశ్రీ ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ ఆధ్యాత్మిక ప్రవచనం చెబుతారు. ఆయా రోజుల్లో సాయత్రం 5 నుంచి 6గంటల వరకు నిర్వహిస్తారు.

12 రోజులు హోమాలు..

ప్రపంచ శాంతి కోసం మహారుద్ర జప అభిషేక సహిత కామ్యార్థ హోమాలను ఈనెల 21 నుంచి జూన్‌ 1 వరకు ఆలయ ఆవరణలో నిర్వహిస్తారు. 21న మహాగణపతి హోమం, 22న సుబ్రహ్మణ్య షాఢాక్షరి హోమం (సంతానప్రాప్తి, శతృబాధ నివారణార్ధం), 23న హయగ్రీవ హోమం (సకల విద్యా ప్రాచ్యర్గం), 24న నవగ్రహ హోమం (నవగ్రహ ప్రసాద సిద్యర్థం), 25న మహామృత్యుంజయ హోమం (అనమృత్యుదోష నివారణార్థం), 26న దుర్గ సూక్త హోమం (సకల ఐశ్వర్య ప్రాష్యర్థం),27న మహా సుదర్శన హోమం (సకల దృష్టి దోష నివారణార్థం), 28న మేద దక్షిణామూర్తి హోమం (మేద ధారణ సిద్యర్ధం), 29న స్వయంవర పార్వతి హోమం (శీఘ్ర వివాహ ప్రాష్యర్ధం), 30న విశాఖ దన్వంతరి హోమం (ఆయుఆరోగ్య ప్రాష్యర్థం), 31న మహారుద్ర హోమం (అష్ట ఆశ్వర్య ప్రాష్యర్థం),జూన్‌1న లఘు చండీ, మహా పూర్ణాహుతి (సకల పాపక్షయార్థం) నిర్వహించనున్నారు.

నదీహారతి, తెప్పోత్సవం..

ప్రతీ రోజు సాయంత్రం 6.30 నుంచి 7.30గంటల వరకు త్రివేణి సంగమం వద్ద కాశీ పండితులతో నదీహారతి కార్యక్రమం, అనంతరం తెప్పోత్సవం నిర్వహిస్తారు. ప్రతీ రోజు సాయంత్రం 7.30 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రసిద్ధ నృత్య కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఫలితంగా ఆధ్యాత్మిక శోభతో కాళేశ్వరం వెలుగులు విరజిమ్మనుంది.

21 నుంచి సరస్వతీనది అంత్య పుష్కరాలు

రోజుకో పీఠాధిపతి రాక

రోజూ నదీహారతి, తెప్పోత్సవం నిర్వహణ

Advertisement
 
Advertisement
Advertisement