ఆరేళ్లుగా నిరుపయోగం | - | Sakshi
Sakshi News home page

ఆరేళ్లుగా నిరుపయోగం

May 10 2026 7:40 AM | Updated on May 10 2026 7:40 AM

మంగపేట: మండలంలోని మల్లూరులో హరిత హోటల్‌ నిర్మాణం పూర్తయి ఆరేళ్లవుతున్నా అధికారులు ప్రారంభించకపోవడంతో నిరుపయోగంగా మారింది. పట్టించుకునే వారు లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. కిటికీలు, భవన సీలింగ్‌, బాత్‌రూమ్‌లను మందుబాబులు ధ్వంసం చేశారు. చీకటి కార్యకలాపాలు జరుగుతున్నాయనే ప్రచారం సాగుతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు.

రూ.4.19 కోట్లతో నిర్మాణం..

మంగపేట మండలం మల్లూరులో టూరిజం, పర్యాటక శాఖ రూ.4.19 కోట్ల నిధులతో 2017లో హరిత హోటల్‌ నిర్మాణ పనులు ప్రారంభించగా 2020లో పూర్తయ్యాయి. హోటల్‌ను ప్రారంభించపోవడంతో ఆరేళ్లుగా నిరుపయోగంగా ఉంది. పర్యాటకులకు ఉపయోగ పడాల్సిన హోటల్‌ రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించే వారికి ఆశ్రయంగా మారింది. నిత్యం రాత్రి వేళల్లోమందుబాబులు, గంజాయి బ్యాచ్‌లు అడ్డాగా మార్చుకుని చీకటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.

ధ్వంసమవుతున్నా పట్టించుకోరా..

హరిత హోటల్‌ కిటకీల అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మరుగు దొడ్లు, మూత్రశాలల డోర్లు, బేసిన్లు, సోలార్‌ ప్యానళ్లు, బ్యాటరీలు వందకు పైగా ఫ్యాన్లు ఎత్తుకుపోయారు. భవనంలోని గదుల్లో సీలింగ్‌ ధ్వంసం చేసి సీలింగ్‌కు వినియోగించిన సామగ్రి, ప్లాస్టిక్‌ పైపులు, విద్యుత్‌ వైర్లు, స్విచ్‌ బోర్డులను ఎత్తుకుపోయారు. అయినా అధికారులు మాత్రం కాపాడే ప్రయత్నం చేయడం లేదు.

సౌకర్యం లేక భక్తుల అవస్థలు..

పర్యాటక హబ్‌గా విరాజిల్లుతున్న జిల్లాలో బొగత జలపాతం, లక్నవరం, రామప్ప, ఏటూరునాగారం అభయారణ్యం వంటి ప్రాంతాలతో పాటు మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలు కొలువై ఉన్నారు. ఇలాంటి చారిత్రాత్మక ప్రదేశాలను చూడడానికి నిత్యం వచ్చే పర్యాటకులు, రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధిగాంచిన శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకునేందుకు నిత్యం వందల సంఖ్యలో వస్తుంటారు. ప్రతీ శని, ఆదివారం ఆలయంలో స్వామివారి తిలతైలాభిషేకం పూజలో పాల్గొని మానవశరీరాన్ని పోలి ఉండే స్వామివారిని దర్శించుకునేందుకు ఒకటి రెండు రోజులు ఇక్కడే ఉండేందుకు ఎంతగానో ఇష్టపడుతుంటారు. పర్యాటకులు, భక్తుల సౌకర్యం కోసం మల్లూరులో నిర్మించిన హరిత హోటల్‌ ప్రారంభానికి నోచుకోకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సీతక్క దృష్టి సారిస్తేనే..

రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్క హరిత హోటల్‌ ప్రారంభంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రారంభానికి నోచుకుంటే భక్తులు, పర్యాటకులకు హోటల్‌ ఉపయోగపడనుంది. మల్లూరు హేమాచల అభివృద్ధిపై కూడా దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

మల్లూరులో రూ.4.19 కోట్లతో హరిత హోటల్‌ నిర్మాణం

2020లో పూర్తయినా ప్రారంభానికి నోచుకోని వైనం

కిటికీలు, భవన సీలింగ్‌, బాత్‌రూమ్‌ల ధ్వంసం

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా..

కన్నెత్తిచూడని అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement