● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు రూరల్: స్వీయ జనగణనకు నేటి (ఆదివారం) వరకు అవకాశం ఉందని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ఆన్‌లైన్ ద్వారా స్వీయ గణన చేసేందుకు అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేటితో ఈ ప్రక్రియ ముగిస్తుందన్నారు. ఈ నెల 11 వ తేదీ నుంచి ఎన్యుమనేటర్లు ఇంటింటికీ వెళ్లి హౌస్ లిస్టు చేపడతారని పేర్కొన్నారు. దేశ ప్రణాళిక, భవిష్యత్ అభివృద్ధి, వనరుల పంపిణీలో జనగణన కీలకమని తెలిపారు. అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారు కూడా తమ ప్రస్తుత నివాసం నుంచే వివరాలు నమోదు చేసుకోవచ్చునని సూచించారు. జనగణన సందర్భంగా అందరూ తమ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను కచ్చితంగా అందించాలని కోరారు. ఈ వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఆన్‌లైన్ నమోదు తదుపరి ఎన్యుమరేటర్ ఐడీ కార్డు వస్తుందని అన్నారు. ఆ నంబర్ ఆధారంగా ఎన్యుమనేటర్ ఇంటికి వచ్చినప్పడు ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని తెలిపారు.
సమర్థవంతంగా నిర్వహించాలి..
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సమర్థవంతంగా కొనుగోళ్లు జరపాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవ రావు అన్నారు. శనివారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పొంచి ఉన్న అకాల వర్షాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి సయ్యద్ షా పైసల్ హుస్సైనీ తదితరులు ఉన్నారు.


