ములుగు రూరల్: ఇటీవల పది ఫలితాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను శుక్రవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, కలెక్టర్ హేమంత్ సహదేవరావులు క లెక్టరేట్ సమావేశ మందిరంలో శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో డీఎఫ్‌ఓ వికాష్ మీనా, అదనపు కలెక్టర్ మహేందర్, ఆర్డీఓ వెంకటేష్, డీఈఓ సిద్దార్థ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఏటూరునాగారం: తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని కొనుగోలు కేంద్రాల్లోని తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ కవర్లు అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ధాన్యం నిల్వ చేసుకునేందుకు సరైన ప్లాట్‌ఫామ్‌లు లేక నేలపై ఆరబెట్టుకోవడంతో వర్షం వల్ల బురదగా మారిందన్నారు. రైతులు బురదలోనే నిల్వ చేసుకోవడం బాధాకరమన్నారు. రైతులకు సరైన సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో కూనూరు అశోక్, వలిబాబా, మల్లారెడ్డి, చిన్ని, తాడూరి రఘు, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు ఆశీర్వచనం
మంగపేట: నూతనంగా జిల్లా కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన హేమంత్ సహదేవరావును హేమాచల క్షేత్రం ఆలయ ఇన్‌చార్జ్ కార్యనిర్వాహణ అధికారి ఎం. వీరస్వామి పూజారులతో కలిసి శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గతనెల 27 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు జరిగిన బ్రహ్మోత్సవాలు (జాతర) సందర్భంగా లక్ష్మీనర్సింహాస్వామి తిరుకల్యాణ మహోత్సవాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు అందజేసి స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయ పూజారులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ అర్చకుడు కారంపుడి పవణ్‌కుమార్, ఆచార్యులు, సిబ్బంది సీతారామయ్య, శేషు తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి రూరల్: ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులు పెండింగ్ స్కాలర్‌షిప్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి ఇందిర శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
‘దళారులను ఆశ్రయించొద్దు’
మల్హర్: రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రక్రాశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తాడిచర్ల ఆధ్వర్యంలో రుద్రారం, దుబ్బపేట గ్రామాలలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రకాశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధరను పొందాలన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండి, సర్పంచ్‌లు చంద్రగిరి సంపత్, భుక్య రవీందర్, కొండ రాజమ్మ, పీఏసీఎస్ డైరెక్టర్ సంగెం రమేష్, మండల నాయకులు బడితల రాజయ్య, వేముల చంద్రమౌళి, చంద్రగిరి అశోక్, సమ్మయ్య, సీఈఓ సంతోష్, రైతులు, హమాలీలు, సిబ్బంది పాల్గొన్నారు.


