కాళేశ్వరంలో కంట్రోల్ రూమ్..
కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని కాళేశ్వరంలో సరస్వతినది అంత్య పుష్కరాలు నిర్వహించడానికి ప్రభుత్వం సమాయత్తమవుతుంది. గతేడాది మే 15నుంచి 26వరకు పన్నెండు రోజుల పాటు సరస్వతీనది ఆది పుష్కరాలు విజయవంతంగా నిర్వహించారు. ఈ నెల 21 నుంచి సరస్వతి నదికి అంత్య పుష్కరాలు నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పరిరక్షణకు నిఘాను తీవ్రతరం చేయడానికి పుష్కరాల్లో అడుగడుగునా సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసుశాఖ సన్నద్ధమైంది.
భద్రత కట్టుదిట్టంగా..
పుష్కరాల సందర్భంగా ప్రతీరోజు వీవీఐపీ, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, పీఠాధిపతులు రానున్నారు. వారికి భద్రత ఏర్పాట్లు చేపట్టనున్నారు. కాళేశ్వరం మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్నందున పోలీసులు 12 రోజుల పాటు అవాంఛనీయ ఘటనలు, ఘర్షణలు, చోరీలు జరుగకుండా చర్యలు చేపట్టనున్నారు. ఒకవేళ ఏమైనా ఘటనలు జరిగితే క్షణాల్లో కేసును ఛేదించడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం లేకపోయినప్పటికీ అనుమానితులను పసిగట్టడానికి వినియోగించనున్నారు.
ప్రముఖులు కోసం..
ప్రముఖులు రాకకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నా యి. అంత్య పుష్కరాల మొదటి రోజున సీఎం రేవంత్‌రెడ్డి, గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో పాటు కంచి పీఠాధిపతి రానున్నట్లు సమాచారం. దీంతో భారీఎత్తున పోలీసులు కెమెరాల ఏర్పాటుకు రంగం సిద్ధంచేస్తున్నారు. 12 రోజుల పాటు పది మందికిపైగా పీఠాధితులు పుష్కర స్నానాలు ఆచరించనున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు స్నానాలు చేస్తారని అధికారుల ద్వార తెలిసింది. వీరితో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా స్నానాలు చేసేందుకు రానున్నారని వినికిడి.
కెమెరాలు ఎక్కడెక్కడంటే..?
కాళేశ్వరంతో పాటు చుట్టుపక్కల శివారుల్లో సుమారు 250కుపైగా సీసీ కెమెరాలు పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కాళేశ్వరం దేవస్థానానికి సంబంధించిన కెమెరాలు 60, ఇప్పటికే పోలీసులు ఏర్పాటు చేసినవి 12, ప్రధాన రహదారిలో 30కిపైగా ఉన్నాయి. దీంతో పాటు మొత్తం 25 లొకేషన్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో లొకేషన్‌లో మూడు నుంచి నాలుగు వరకు కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మజీదుపల్లి రోడ్డు, వీఐపీఘాటు, అక్కడే ఉన్న పార్కింగ్ స్థలాలు, ప్రధానఘాటు నుంచి వీఐపీ ఘాటు వరకు ఉన్న రోడ్డు, అక్కడే ఉన్న హెలిపాడ్ వద్ద, ప్రధానఘాటు, శ్రాద్ధ మండపాలు, గోదావరి నుంచి బస్టాండ్ వరకు, ఆలయం చుట్టు పరిసరాలు, మహారాష్ట్ర రోడ్డు అంతర్రాష్ట్ర వంతెన నుంచి కాళేశ్వరం బస్టాండ్ వరకు, అక్కడే ఉన్న పార్కింగ్, హరిత హోటల్ సమీపంలో, సబ్‌స్టేషన్ నుంచి పలుగుల బైపాస్ రోడ్డు వరకు, అక్కడే ఉన్న పార్కింగ్ స్థలం, ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు స్థలం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.
అంత్య పుష్కరాలకు భద్రత కట్టుదిట్టం
తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ‘కాళేశ్వరం’
250కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు
ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్‌రూమ్
లక్షలాదిగా తరలిరానున్న భక్తజనం
కాళేశ్వరం పోలీసుస్టేషన్‌లోనే కమాండ్ కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. కాళేశ్వరంలో పుష్కరాల కోసం అమర్చిన సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు వీక్షించడానికి ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని ఠాణాలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో నేరనియంత్రణ చేయడానికి పోలీసులు పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు. 12 రోజులపాటు వీక్షిస్తూ భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించనున్నారు.


