ఇళ్ల గణన పకడ్బందీగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల గణన పకడ్బందీగా చేపట్టాలి

May 8 2026 1:25 PM | Updated on May 8 2026 1:25 PM

ములుగు:/ములుగు రూరల్‌: ఇళ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన జనగణన అధికారి, సంచాలకులు భారతి హోళికేరి అన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు, అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 11 నుంచి జూన్‌ 9వ తేదీ వరకు నిర్వహించే ఇళ్ల గణన ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలన్నారు. అన్ని స్థాయిల్లో ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల శిక్షణ పూర్తి చేయాలని ఆదేశించారు. 10వ తేదీలోపు వారికి మెటీరియల్‌ కిట్‌లు, గుర్తింపు కార్డులు అందజేయాలని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు మాట్లాడుతూ జిల్లాలో 11వ తేదీ నుంచి ఇళ్ల గణనకు సంబంధించి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విధులు నిర్వహించే సిబ్బందికి సైతం శిక్షణ పూర్తి అయిందని వివరించారు. స్వీయ గణనకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలందరికీ తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వీయ గణనపై అవగాహన కల్పించి అక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీపీఓ ప్రకాశ్‌, ఎస్‌ఓ లాల్‌ తదితరులు పాల్గొన్నారు.

మాక్‌డ్రిల్‌ కీలకం

విపత్తు నిర్వహణలో మాక్‌డ్రిల్‌ స్పందన కీలకపాత్ర పోషిస్తుందని రాష్ట్ర రెవెన్యూ విపత్తు నిర్వహణ కార్యదర్శి హరిచందన అన్నారు. ఈ మేరకు ఆమె టేబుల్‌ టాప్‌ ఎక్సర్‌ సైజ్‌కు సంబంధించి వివిధ శాఖల అధికారులతో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి గురువారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ ఈ నెల 18న జిల్లాలో రాష్గ్రస్థాయి మాక్‌ ఎక్సర్‌సైజులు జరుగుతాయని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా నుంచి కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు, అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ, సివిల్‌ సప్లయీస్‌ అధికారి ఫైజల్‌ హుస్సేన్‌, డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు, డీపీఓ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

వీసీలో రాష్ట్ర ప్రధాన జనగణన అధికారి, సంచాలకులు భారతి హోళికేరి

Advertisement
 
Advertisement
Advertisement