‘పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి’ | - | Sakshi
Sakshi News home page

‘పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి’

May 7 2026 9:20 AM | Updated on May 7 2026 9:20 AM

ములుగు రూరల్‌: అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాదన్న ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతు కూలీ సంఘం కార్యాలయంలో బుధవారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి, మొక్కజొన్న, మామిడి పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పరకాల స్వామి, నాంపల్లి స్వామి, కొమురయ్య, సూరమ్మ, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి పనుల పరిశీలన

మంగపేట: మండల పరిధిలోని కోమటిపల్లి, తొండ్యాలలక్ష్మీపురంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను అదనపు డీఆర్‌డీఓ కొండా కృపాకర్‌ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉపాధిహామీ కూలీలకు ఏప్రిల్‌, మే రెండు నెలల్లో 2.70 లక్షల పని దినాలను కల్పించాలని వెల్లడించారు. లక్ష్యాన్ని పూర్తి చేసేలా కూలీల సంఖ్య మరింత పెరిగే విధంగా కూలీలకు ఉపాధిపనులపై మరింత అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం కోమటిపల్లి, కొత్తూరుమొట్లగూడెం పంచాయతీ పరిధిలోని తొడ్యాలలక్ష్మీపురంలో కొనసాగుతున్న ప్రాంతాలను సందర్శించారు. పనులకు వచ్చిన కూలీలతో మాట్లాడి స్వయంగా ఆయన సెల్‌ఫోన్‌లో ఫొటో క్యాప్చర్‌ ద్వారా కూలీల హాజరును నమోదు చేశారు. ఆయన వెంట ఈజీఎస్‌ ఏపీఓ అంకూస్‌, పీల్డ అసిసస్టెంట్లు ఉన్నారు.

విద్యార్థులకు

సువర్ణావకాశం

ఏటూరునాగారం: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న పేద, ప్రతిభగల విద్యార్థులకు సినిమా హీరో సంజోష్‌ ఫౌండేషన్‌ సువర్ణావకాశాన్ని కల్పిస్తున్నట్లు హీరో సంజోష్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 900 మార్కులు దాటిన విద్యార్థులకు, పదో తరగతిలో 500 మార్కులు దాటిన విద్యార్థులకు ఉపకార వేతనాలు రూ.2 వేల చొప్పున అందజేస్తామని వెల్లడించారు. సంబంధిత విద్యార్థులు 9000203486 నంబర్‌కు సమాచారం అందజేసి ఉపకార వేతనం అందుకోవాలని వివరించారు.

రావి ఆకుపై

హీరో విజయ్‌ చిత్రం

ఏటూరునాగారం: తమిళనాడు హీరో విజయ్‌ సీఎంగా ఎన్నిక కాబోతున్న శుభ సందర్భంగా రావి ఆకుపై విజయ్‌ బొమ్మను మండల కేంద్రానికి చెందిన డ్రాయింగ్‌ మాస్టర్‌ రమేశ్‌ గీశారు. మండల పరిధిలోని చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాల డ్రాయింగ్‌ టీచర్‌ రమేశ్‌ వినూత్నంగా ఆలోచించారు. రావి ఆకుపై కాబోయే తమిళనాడు సీఎం విజయ్‌ చిత్రాన్ని అద్భుతంగా గీసి ప్రదర్శించారు. ఆయన ప్రతిభను స్థానికులు అభినందించారు.

ఫైరింగ్‌ ప్రాక్టీస్‌

భూపాలపల్లి అర్బన్‌: జిల్లా పోలీసుల వార్షిక మొబిలైజేషన్‌ శిక్షణలో భాగంగా వరంగల్‌ జిల్లా అమ్మవారిపేట ఫైరింగ్‌ రేంజ్‌లో బుధవారం ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ హాజరై.. అధికారుల ఫైరింగ్‌ను పరిశీలించి సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా స్పందించేందుకు ఆయుధాలపై పూర్తి ప్రావీణ్యం అవసరమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement