తూర్పారా మిషన్లు కరువు | - | Sakshi
Sakshi News home page

తూర్పారా మిషన్లు కరువు

May 7 2026 9:20 AM | Updated on May 7 2026 9:20 AM

ఏటూరునాగారం: జిల్లాలోని 10 మండలాల పరిధిలో 140 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు కొనుగోలు కేంద్రాలకు సరిపోయే విధంగా తూర్పారా మిషన్లను ప్రభుత్వం సమకూర్చలేదు. దీనికి తోడు ఐకేపీ, జీసీసీ, సహకార సంస్థ వంటి కొనుగోలు కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం నిల్వ చేసే గిడ్డంగులు, టార్పాలిన్లు, బరకాలు, తూర్పాల పట్టే మిషన్లు రైతులకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఇవ్వకపోవడంతో ధాన్యాన్ని ఆరబోసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతూ విక్రయాలు జరపాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటికితోడు వర్షం కూడా రైతులను ఆగమాగం చేస్తోంది.

గతంలో కేంద్రానికి రెండు మిషన్లు

గతంలో కొనుగోలు కేంద్రాల వద్ద రెండు చొప్పున తూర్పారా మిషన్లను ఏర్పాటు చేసేది. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన తర్వాత ధాన్యంలో ఉన్న ఎండిపోయిన పుల్లలు, తాలును పట్టిన తర్వాత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తేమశాతం పరిశీలించి 17 వరకు ఉంటేనే కొనుగోలు చేస్తారు. మిషనరీల కొరత కారణంగా రైతులే చాటలు, బస్తాలను పెట్టి ధాన్యాన్ని తూర్పారా పట్టి శుభ్రం చేసుకుంటున్నారు. దానివల్ల ధాన్యం కాంటా కాకపోవడంతో కొనుగులు కేంద్రంలో నిల్వ ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇదే సమయంలో అకాల వర్షంతో ధాన్యం తడవడంతో రైతులు నష్టపోతున్నారు. ఈ క్రమంలో ధాన్యాన్ని తిరగబోసుకొని విక్రయాలు జరుపుకోవాల్సిన దుస్థితి ఉంటుంది. ధాన్యం తడిస్తే తేమశాతం ఎక్కువ రావడం, మొలక రావడం ఉంటుందని ధరను తగ్గించే ప్రయత్నాలను కొనుగోలు కేంద్రాల వారు చేస్తున్నారు. దీనికి ప్రభుత్వ అధికారులు వత్తాసు పలకడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదేకాకుండా ప్రభుత్వ పరమైన ప్యాడీ క్లీనర్స్‌ అందుబాటులో లేక ప్రైవేట్‌ మిషనరీలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.650 లు చెల్లించి క్లీనింగ్‌ చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

కానరాని శాశ్వత గిడ్డంగులు

జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం, కొనుగోలు చేసేందుకు వచ్చిన ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలో అర్ధం కానీ పరిస్థితి నెలకొంది. ధాన్యం నిల్వలు చేసేందుకు పక్కాగా శాశ్వతమైన గిడ్డంగులు లేకపోవడంతో రైతులు ప్రతీ ఏడాది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గిడ్డంగుల నిర్మాణం గత ప్రభుత్వం చేపట్టినప్పటికీ అవి పూర్తికాలేదు. ఈ ప్రభుత్వంలో ఎలాంటి గిడ్డంగుల నిర్మాణాలపై దృష్టిపెట్టడం లేదు.

ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలి..

కొనుగోలు కేంద్రాల వద్ద ప్యాడీ క్లీనర్లను ఏర్పాటు చేయాలి. తూర్పాల పట్టేందుకు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. ధాన్యం ఇక్కడికి తీసుకొచ్చి మిషనరీలు అందుబాటులో లేక పడిగాపులు కాయాల్సి వస్తోంది. తూర్పారా పట్టే మిషన్లను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చి కొనుగోళ్ల ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలి.

–చిట్టిపోతుల వినోద,

చిన్నబోయినపల్లి, ఏటూరునాగారం

తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి..

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. కోతలు విధించవద్దు. బస్తాలను వెంటనే కొనుగోలు చేసి మిల్లుకు తరలించాలి. రైతుల ధాన్యాన్ని బయట ఆరబెట్టుకునేందుకు బర్కాలు, టార్పాలిన్ల సౌకర్యం కల్పించాలి. వర్షాలకు తడిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి.

–బోజనపు భిక్షపతి, ఏటూరునాగారం

ఒక్కో కొనుగోలు కేంద్రానికి

ఒకటే కేటాయింపు

ధాన్యానికి సరిపడా లేక రైతులు అవస్థలు

పలు కేంద్రాల్లో మరమ్మతులకు

గురైన మిషన్లు

వర్షాలకు తడిసిముద్ధవుతున్న ధాన్యం

పట్టించుకోని అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement