● ఆనందోత్సాహాల నడుమ వసంతోత్సవం
● గజవాహనంపై లక్ష్మీనర్సింహస్వామి, అమ్మవార్ల ఊరేగింపు
మంగపేట: మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో గతనెల 27న అంకురార్పణతో ప్రారంభమైన స్వామివారి బ్రహ్మోత్సవాలు(జాతర) బుధవారం వసంతోత్సవంతో ముగిశాయి. ఆలయ ఇన్‌చార్జ్ కార్యనిర్వహణ అధికారి ఎం.వీరస్వామి చీఫ్ ఫెస్టివల్ అధికారి శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థాన ఆలయ ఉపప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం పది రోజుల పాటు బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు కార్యక్రమంలో భాగంగా ఆలయంలోని స్వయంభు స్వామివారికి, యాగశాలలో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నవదంపతులు లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలతో అలంకరించారు. గజవాహనంపై ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపం నుంచి దైత అమ్మవారు(వనదేవత) ప్రాంగణం వరకు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా వసంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యాగ్నికులు, ఆలయ పూజారులు, సిబ్బంది ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ వసంతోత్సవ కార్యక్రమాన్ని ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకున్న వందలాది మంది భక్తులు వసంతోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ సురేశ్, ఆలయ అర్చకులు ముక్కామల రాజశేఖర్‌శర్మ, పవన్‌కుమార్ ఆచార్యులు, అనిపెద్ది నాగరాజీవ్‌శర్మ, ఏడునూతుల ఈశ్వర్‌చంద్ రామానుజదాస్, బ్రహ్మోత్సవాల యాగ్నికులు పెరంబదూర్ మధనమోహనాచార్యులు, శ్రీకృష్ణ యజుర్వేదం పండితులు వరప్రసాధ్, శ్రీరంగం వెంకటాచార్యులు, బరధ్వాజాచార్యులు, అమరవాది రామనర్సింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.


