తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి

May 6 2026 8:49 AM | Updated on May 6 2026 8:49 AM

ములుగు రూరల్‌: రైతుల ధాన్యాన్ని తరుగు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకులు సూడి కృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలపై అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీకి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. రైతులు పండించిన ధాన్యమంతా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో కనిపించడం లేదన్నారు. రైతుల ధాన్యంలో నుంచి మిల్లర్లు ఐదు నుంచి ఆరు కిలోల కటింగ్‌ పెడుతున్నారని వివరించారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల వెంకట్‌రెడ్డి, రత్నం రాజేందర్‌, చిట్టిబాబు, గపూర్‌ పాషా, తదితరులు పాల్గొన్నారు.

స్వీయ గణన డిజిటల్‌ నమోదు

ములుగు: జనగణన కార్యక్రమంలో భాగంగా స్వీయ గణన డిజిటల్‌ నమోదును మంగళవారం ఆన్‌లైన్‌లో అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26నుంచి మే 10వ తేదీ వరకు సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు స్వీయ గణనలో తమ వివరాలు నమోదు చేసుకోవడంతో సమయం ఆదా అవుతుందన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా స్వీయ గణనలో ప్రతిఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలు అందరూ జనగణన కార్యక్రమంలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

చోరీ కేసులో

ముగ్గురి అరెస్ట్‌

ములుగు రూరల్‌: జిల్లా కేంద్రంలోని ఓ ఇంటి తాళాలు పగులకొట్టి చోరీకి పాల్పడిన కేసులో మంగళవారం పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు వివరాలను డీఎస్పీ రవీందర్‌ వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది జనవరి 21న ములుగులో మేరుగు రవికి చెందిన ఇంటి తాళాలు పగులగొట్టి 65గ్రాముల బంగారం, రూ.35వేల నగదును గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాల ఆధారంగా నేరస్తులను గుర్తించినట్లు తెలిపారు. అరెస్ట్‌ చేసిన వారిలో బోడ గణేశ్‌, జబ్బ సిద్ధు, అల్వా విపిన్‌ కుమార్‌లు ఉండగా పుల్లూరు రాజేశ్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రెండు బంగారు ఉంగరాలు, జత కమ్మలు, బైక్‌, మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఉపేందర్‌రావు తదితరులు ఉన్నారు.

నిందితుల అరెస్ట్‌, రిమాండ్‌

ఏటూరునాగారం: మండల పరిధిలోని చిన్నబోయినపల్లి సెక్షన్‌, బీటు పరిధిలోని అటవీ ప్రాంతంలో చుక్కల దుప్పిని వేటాడి హతమార్చిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి జిల్లా కోర్టుకు రిమాండ్‌కు పంపినట్లు అటవీక్షేత్రాధికారి అబ్ధుల్‌ రహమాన్‌ తెలిపారు. శాపెల్లి గ్రామానికి చెందిన ఉన్నిని లచ్చిమ్‌, యాలం చందు, ఆకులవారిఘనపురంకు చెందిన కుడుదుల నర్సింగరావులు కొంతకాలంగా వేట సాగిస్తున్నారు. ఈ క్రమంలో దుప్పిని హతమార్చారు. ఈ మేరకు వారిపై వణ్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం కేసునమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్‌ అధికారి నారాయణ, ఎఫ్‌బీఓ కేఎం చిస్టీ, దయానంద్‌, బేస్‌క్యాంప్‌ సిబ్బంది పాల్గొన్నారు.

కాటారం ఆర్డీఓగా రవీందర్‌

మల్హర్‌ (కాటారం): కాటారం రెవెన్యూ డివిజనల్‌ అధికారిగా (ఆర్డీఓ) రవీందర్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పనిచేసిన సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌ సింగ్‌ హైదరాబాద్‌కు ఇటీవల బదిలీ అయిన విషయం తెలిసిందే. కాగా, ఆయన స్థానంలో కాటారం ఆర్డీఓగా రవీందర్‌ వచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement