ఆయిల్‌పామ్‌ సాగుతో అధిక లాభాలు | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌ సాగుతో అధిక లాభాలు

May 6 2026 8:49 AM | Updated on May 6 2026 8:49 AM

అదనపు కలెక్టర్‌ సంపత్‌రావు

ములుగు: ఆయిల్‌పామ్‌ పంటసాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని అదనపు కలెక్టర్‌ సంపత్‌రావు పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉద్యానవన శాఖ అధికారి సంజీవరావు అధ్యక్షతన ములుగు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం పంటలసాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యానవన, ప్రత్యామ్నాయ పంటలపై రైతులు ఆసక్తి చూపాలని పిలుపునిచ్చారు. రైతులు సేద్యం చేసే పంటల డిమాండ్‌ను బట్టి ధర ఉంటుందని తెలిపారు. మార్కెట్లో డిమాండ్‌ కలిగిన పంటలను సాగు చేయడం ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందని తెలిపారు. నిత్యావసర సరుకుగా ఉన్న వంట నూనె నిల్వలను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. ఆయిల్‌పామ్‌ పంటకు మంచి డిమాండ్‌ ఉందని, రైతులు సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్‌పామ్‌ సాగులో అంతర్గత పంటలను కూడా పండించవచ్చని తెలిపారు. దీంతో రైతులకు రెండు పంటల ద్వారా ఆదాయం లభించే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఒకసారి ఆయిల్‌పామ్‌ సాగుబడి చేస్తే 30 సంవత్సరాల వరకు నిరంతర పంట దిగుబడితో ఆదాయం వస్తుందని స్పష్టం చేశారు. అనంతరం ఉద్యానశాఖ అధికారి సంజీవరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1,069 మంది రైతులు 3,562.40 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తున్నారని తెలిపారు. ఒక ఎకరాకు ప్రభుత్వం రూ.50 వేల వరకు సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ చింతనిప్పుల చంద్రకళ, ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్‌ పద్మావతి, ఆత్మ కమిటీ చైర్మన్‌ రవీందర్‌ రెడ్డి, కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్‌ గౌడ్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి సాల్మన్‌ రాజు, డీసీఓ రామ్మోహన్‌, కేఎన్‌ బయోసైన్స్‌ కంపెనీ ఎండి.సుధారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement