హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు పైలెట్ గ్రామాలను ఎంపిక చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులు భరించి పైలెట్‌గా ఎంపిక చేసిన గ్రామాల్లోని ప్రతీ ఇల్లు, ప్రతీ వ్యవసాయ పంప్‌సెట్‌ను సౌర విద్యుద్ధీకరిస్తున్నారు. అయితే వీటిని మరింతంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 81 గ్రామాలను రూ.1,380 కోట్ల వ్యయంతో పూర్తిగా సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ 9 గ్రామాలను సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నారు. వీటికి అదనంగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని పైలట్‌గా ఎంపిక చేసి సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్ కో) గ్రామాలను గుర్తించే పనిలో నిమగ్నమైంది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో 12 గ్రామాలు సంపూర్ణ సోలార్ గ్రామాలుగా మారనున్నాయి.
కొనసాగుతున్న పనులు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముందుగా ఎంపిక చేసిన 9 గ్రామాలను సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దేపనులు కొనసాగుతున్నాయి. సోలార్ పలకల బిగింపు పనులు నడుస్తున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంపిక చేయనున్న ఒక్క గ్రామంలో ఒక్కో ఇంటిపై 2 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేస్తారు. ప్రతీ ఇంటికి రూ.1.36 లక్షలు ప్రభుత్వం భరిస్తుంది. ప్రతీ ఇంటికి నెట్ మీటర్ బిగిస్తారు. ఈ మీటర్ ఇంటికి వినియోగిస్తున్న విద్యుత్, మిగిలిన విద్యుత్ గ్రిడ్‌కు ఎంత సరఫరా జరిగిందో యూనిట్ల వారీగా రికార్డు చేస్తుంది. ప్రతీ ఇంటిపై ఏర్పాటు చేసిన 2 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్రాంట్ ద్వారా నెలకు 240 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. గృహ సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి జరిగి గ్రిడ్‌కు సరఫరా చేసిన ప్రతి యూనిట్‌కు రూ.4.99 చొప్పున చెల్లిస్తుంది. అయితే ఇంటికి వినియోగించుకోగా మిగిలిన విద్యుత్‌కు మాత్రమే చెల్లింపులు చేస్తారు. గృహ విద్యుత్ వినియోగదారులు తాము వాడుకున్న విద్యుత్‌కు బిల్లులు చెల్లించాల్సిన అవసరముండదు. దీంతో పరోక్షంగా ఆర్థికంగా లబ్ధిపొందుతారు.
గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది...
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక గ్రామాన్ని మోడల్ సోలార్ గ్రామంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. గ్రామాల ఎంపిక పూర్తి కాగానే.. సోలార్ ఫలకల బిగింపు పనులు మొదలవుతాయి. ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో ప్రజలను సోలార్ విద్యుత్ వైపు మళ్లించేందుకు, ప్రోత్సహించేందుకు మోడల్ సోలార్ గ్రామాలుగా ఎంపిక చేసి పూర్తి సోలార్ గ్రామాలుగా తీర్చిదిద్దుతోంది.
– మహేందర్ రెడ్డి, రెడ్‌కో మేనేజర్, హనుమకొండ
గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తే లక్ష్యం..
గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తే లక్ష్యంగా పర్యావరణహిత సౌర విద్యుత్ అందరూ వినియోగించుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఈక్రమంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పైలెట్ గ్రామాలను ఎంపిక చేసి సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామాలుగా తీర్చిదిద్దుతోంది. ఈ పథకంలో ప్రభుత్వమే ఖర్చు భరిస్తుండడంతో వినియోగదారులపై ఏ మాత్రం ఆర్థిక భారం పడట్లేదు. దీంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా సౌర విద్యుత్ మారనుంది. ఉత్తత్తి అయిన సౌర విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేయడం ద్వారా విద్యుత్ వినియోగదారుడికి ఆర్థిక లబ్ధి చేకూరనుంది.
నియోజకవర్గానికో గ్రామం ఎంపిక
ప్రభుత్వ ఖర్చుతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు
ఎంపికపై దృష్టి సారించిన రెడ్ కో


