
కీటకజనిత వ్యాధులపై అప్రమత్తం
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు
ములుగు: వర్షాకాలంలో ఎదురయ్యే మలేరియా, డెంగీ, చికెన్‌గున్యా, మెదడువాపు వంటి కీటకజనిత వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు సూచించారు. జిల్లా కేంద్రంలో తన కార్యాలయంలో వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, మానిటరింగ్ సూపర్‌వైజర్లతో వచ్చే వర్షాకాల వ్యాధుల నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజలకు సూచనలు చేస్తూ దోమలు వ్యాప్తి చెందకుండా యాంటీ లార్వాలను నీటి నిల్వ ప్రాంతాల్లో వదలాలన్నారు. పీహెచ్‌సీల వారీగా హైరిస్క్ గ్రామాలను గుర్తించి దోమతెరల పంపిణీ చేపట్టాలన్నారు. ఆర్డీటీ, డెంగీ కిట్లను నిల్వ ఉంచుకోవాలన్నారు. టీమోపాజ్, మలాథియాన్ పైరిత్రిన్ రసాయనాలను సమకూర్చుకొని దోమల నివారణకు కార్యచరణ రూపొందిచుకోవాలన్నారు. ప్రతీ సబ్ సెంటర్ పరిధిలో శుక్రవారం డ్రైడే నిర్వహించాలన్నారు. వచ్చే మూడు నెలలకు సరిపడా మందులను ముందస్తుగా నిల్వ చేసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విపిన్‌కుమార్, జిల్లా ప్రోగ్రాం అధికారులు శ్రీకాంత్, చంద్రకాంత్, రణధీర్, ఎస్‌ఓ స్వరూపరాణి, హెల్త్ ఎడ్యుకేటర్ అరుణ తదితరులు పాల్గొన్నారు.