
మహిళలు, బాలికలకు అండగా సఖి కేంద్రం
● సఖి కేంద్రం అధికారి రాధ
వాజేడు: మహిళలు, బాలికలకు సఖి కేంద్రం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సఖి కేంద్రం అధికారి వి.రాధ తెలిపారు. మండల పరిధిలోని చింతూరు గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి మంగళవారం అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వారికి అండగా సఖి కేంద్రం ఉంటుందని సూచించారు. గృహ హింసలు, లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు మొదలైన హింసల నుంచి రక్షణ కల్పించనున్నట్లు వారికి వెల్లడించారు. సమాజంలో మహిళలు, బాలికలకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. అవసరమైతే సలహాలు, కౌన్సెలింగ్, రక్షణ కల్పించనున్నట్లు వెల్లడించారు. ఏదైనా సమస్య వస్తే మహిళా హెల్ప్‌లైన్ నంబర్ 181కి ఫోన్ చేయాలని సూచించారు. ఆమె వెంట గ్రామ పంచాయతీ కార్యదర్శి అశోక్ ఉన్నారు.