ములుగు: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ములుగులోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో మోటార్ వాహన చట్టంపై న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ సీనియర్ జడ్జి కన్నయ్యలాల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ లైసెన్స్ ప్రాధాన్యతను వివరించారు. బీమా, లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే చట్ట విరుద్ధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ శ్రీనివాస్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్వామిదాస్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో విద్య
ములుగు రూరల్: చిన్నారులు ఒత్తిడికి గురికాకుండా ఆటపాటలతో విద్యను నేర్పించేందుకు అంగన్‌వాడీ కేంద్రాలు ఉపయోగపడుతాయని జిల్లా సంక్షేమ అధికారి శిరీష అన్నారు. ఈ మేరకు బుధవారం వ్రతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో మల్లంపల్లి, బండారుపల్లి అంగన్‌వాడీ కేంద్రాలలో ఫ్రీస్కూల్ సంసిద్ధత మేళా నిర్వహించగా ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లల్లో శారీరక, మానసిక, సామాజిక, భాష, పూర్వగణిత సంసిద్ధతపై చిన్నారుల తల్లిదండ్రులను అవగాహన కల్పించామని తెలిపారు. చిన్నారులు చిన్నతనంలో నేర్చుకున్న అంశాలు జీవితకాలం గుర్తుంటాయని వివరించారు. చిన్నారుల ప్రవర్తనపైనే భవిష్యత్ ఆధారపడి ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్‌వైజర్ కమరున్నీసబేగం, వ్రతం కోఆర్డినేటర్ నాగేశ్వర్‌రావు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
భక్తుల సందడి
మంగపేట: మండల పరిధిలోని శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు బుధవారం స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. చింతామణి జలపాతం వద్ద నీటిని తాగి ఆహ్లాదంగా గడిపారు. కొబ్బరికాయలను కొట్టి పూజలు చేశారు. శిఖాంజనేయస్వామిని దర్శించుకున్నారు. దీంతో ఆలయం, షాపుల వద్ద భక్తులతో సందడి వాతావరణం నెలకొంది.
వ్యాపార అభివృద్ధిపై అవగాహన
ములుగు రూరల్: గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని గిరిజన సహకార సంఘాల సభ్యులకు వ్యాపార అభివృద్ధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ మేరకు బుధవారం ఐసీఎం డైరెక్టర్ జారీసన్ అభివృద్ధి ప్రణాళికపై సభ్యులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సహకార సంఘాల సభ్యులకు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకుని వ్యాపార రంగంలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీఎం డిప్యూటీ డైరెక్టర్ శ్యాంకుమార్, రిటైర్డ్ డీసీఓ జనార్ధన్‌రెడ్డి, జిల్లా సహకార సంఘం కార్యాలయ ఉద్యోగులు రాజేష్, చంద్రశేఖర్, సహకార సంఘాల సీఈఓలు పాల్గొన్నారు.
నూతన భవనాల ఆవిష్కరణ
గోవిందరావుపేట: మండల పరిధిలోని చల్వాయి గ్రామంలో ఉన్న తెలంగాణ స్పెషల్ పోలీస్ 5వ బెటాలియన్‌లో బుధవారం నూతనంగా నిర్మించిన వివిధ భవనాలను రాష్ట్ర ప్రత్యేక పోలీస్ అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్ ఆవిష్కరించారు. అనంతరం బెటాలియన్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ కమాండెంట్ కె.సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ కమాండెంట్ అనిల్ కుమార్, ఆర్‌ఐలు శోభన్ బాబు, కార్తీక్, సాల్మన్ రాజు, శ్రీనివాస చారి, రాంప్రసాద్, స్వామి, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.

న్యాయ విజ్ఞాన సదస్సు

నూతన భవనాల ఆవిష్కరణ