
ఎరుకలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి
● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,
ఎమ్మెల్సీ కవిత
వెంకటాపురం(ఎం): ఎరుకలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని మాజీ సీఎం కేసీఆర్ ఎరుకల ఎంటర్ ప్రిన్యూర్ షిప్ పథకాన్ని తీసుకొచ్చారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మండల పరిధిలోని రామాంజాపూర్ పరిధిలో గల ఎరుకల నాంచారమ్మ జాతరకు ఆమె సోమవారం హాజరై పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 800 ఏళ్ల క్రితమే ఇక్కడ నాంచారమ్మ ఆలయం ఉన్నట్లుగా గుర్తులున్నాయన్నారు. నాంచారమ్మ ఆలయ నిర్మాణంతో పాటు జాతరకు ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. అనంతరం ఆమె ఎరుకల కులస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజు, జిల్లా అధ్యక్షుడు భిక్షపతి, మాజీ జెడ్పీటీసీ రుద్రమదేవి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌బాబు, జిల్లా నాయకులు మల్క రమేష్, పోరిక గోవింద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రామప్ప దేవాలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామప్ప గార్డెన్‌లో కవిత విలేకర్లతో మాట్లాడారు. ఈ క్రమంలో పర్యాటకులు కవితతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు.