
కనులపండువగా.. హేమాచలుడి కల్యాణం
మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి తిరుకల్యాణ మహోత్సవాన్ని యాగ్నికులు సోమవారం కనులపండువగా జరిపించారు. ఉదయం 7 నుంచి 9 గంటలకు ఆలయంలోని స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు వేద పండితులు వేదమంత్రోచ్ఛరణల నడుమ కల్యాణం జరిపించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యులు, శిష్యబృదం ఉదయం 10 గంటలకు ఉత్సవ మూర్తులను కల్యాణ మండపానికి చేర్చారు. మధ్యాహ్నం 12.32 గంటలకు అభిజిత్ లగ్నంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తుల కల్యాణ మహోత్సవ క్రతువును వేదమంత్రోచ్ఛరణల నడుమ జిలకర బెల్లం, మంగళ సూత్రధారణ, ముత్యాల తలంబ్రాలతో ఆలయ సాంప్రదాయ ప్రకారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణం తిలకించేందుకు భక్తులు సుమారు 35వేలకు పైగా తరలివచ్చి కల్యాణం తిలకించి దర్శించుకున్నారు.
ధృవమూర్తులకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు
లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి కల్యాణం తిలకించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ఆమె తనయుడు సూర్య కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి తిలకించారు. ఈ సందర్బంగా స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు సీతక్క పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. అదే విదంగా కంచర్ల గోపన్న 10వ తరం వారసుడు కంచర్ల శ్రీనివాస్ ఉత్సవ మూర్తులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం జాతర సందర్భంగా ఆయలంలో రూ.17లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు, డ్రెయినేజీ, కిచెన్ షెడ్ ప్లోరింగ్ పనులను కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దాతల సాయంతో స్వామివారి కల్యాణ మహోత్సవానికి వచ్చిన వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.
పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన మంత్రి సీతక్క
భారీగా తరలివచ్చిన భక్తులు

కనులపండువగా.. హేమాచలుడి కల్యాణం

కనులపండువగా.. హేమాచలుడి కల్యాణం