వాజేడు: ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక, కేటాయింపుల్లో ఎస్సీలకు అన్యాయం జరిగిందని దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ముద్ద పిచ్చయ్య ఆరోపించారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జగన్నాథపురంలో 300 ఎస్సీ కుటుంబాలు ఉండగా అందులో 53 మందినే లబ్ధిదారులుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. వారిలో కేవలం ఎనిమిది మందికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారని వివరించారు. ఒక్కో కుటుంబంలో రెండు, అంతకంటే ఎక్కువ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఇతే తరహాలో ఎస్సీలకు అన్యాయం జరిగిందన్నారు. అధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలని కోరారు.
మల్లూరుకు అంజన్న స్వాముల పాదయాత్ర
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని రామాలయం ఆలయానికి చెందిన ఆంజన్నస్వామి మాలధారులు ఆదివారం సాయంత్రం రామాలయం గుడి నుంచి మల్లూరు గుట్టకు పాదయాత్రతో బయలుదేరారు. గురుస్వాములు నకిరబోయిన రమేష్, గాడిచర్ల సాంబయ్య, ఇర్సవడ్ల సంతోష్, మండల నాగరాజు ఆధ్వర్యంలో స్వాములు ఆంజనేయుడి జెండాలను పట్టుకొని పాదయాత్రగా బయలుదేరారు. మల్లూరు గుట్టలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో నేడు జరగబోయే కల్యాణ మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మాచర్ల వెంకటేశ్వర్లు, లక్క మహేశ్, మాదరి నరేష్, సిద్ధు, విజయ్, లవన్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
రేగొండ: మండలంలోని కోటంచ ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణం ఆది వారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతి నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. ఆది వారం అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంత రం కల్యాణాన్ని నిర్వహించారు. ఆరగింపుతో కల్యాణ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అర్చకులు బుచ్చమాచార్యులు, శ్రీనా ధచార్యులు, ఆలయ సిబ్బంది శ్రావణ్, సుధాకర్, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
సింగరేణి సీఎండీ పూజలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామిని సింగరేణి సంస్థ సీఎండీ బలరాంనాయక్, రాష్ట్ర దేవాదాయశాఖ సలహాదారు గోవిందహరి వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆదివారం ఆయన ఆలయానికి రాగా అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో అభిషేకం, శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో దర్శనం చేశారు.

లక్ష్మీనరసింహస్వామి కల్యాణం