
పాలిసెట్ ఎంట్రెన్స్‌కు ఏర్పాట్లు
ములుగు: డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి ఈ నెల 13న నిర్వహించనున్న పాలిసెట్–2025 ఎంట్రెన్స్ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు కో ఆర్డినేటర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొప్పుల మల్లేశం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జాకారం కళాశాలలో రెండు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 720 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయనున్నారని వెల్లడించారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు పరీక్ష ఉంటుందని, ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రలోకి అనుమతి ఉండదని వివరించారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్‌తో హాజరుకావాలని సూచించారు. హెచ్‌బీ పెన్సిల్, బాల్ పాయింట్ పెన్, ఎరేజర్, షార్ప్‌నర్‌కు మాత్రమే అనుమతి ఉంటుందని వివరించారు.
పోలీసుల అదుపులో మిలీషియా సభ్యులు?
వాజేడు: మండల పరిధిలోని ఓ గ్రామంలో తలదాచుకున్న మిలీషియా సభ్యులను శని వారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మిలీషియా సభ్యులు తలదాచుకున్న విషయం తెలియడంతో అక్కడికి వెళ్లి పోలీసులు మొదట ఇద్దరిని, ఆ తర్వాత ఏడుగురిని మొత్తంగా 9 మందిని అదుపులోకి తీసుకుని ములుగుకు తరలించినట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువగా మహిళలే ఉన్నట్లు సమాచారం.
గురుకుల అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
వాజేడు: గురుకులంలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చేరడానికి దరఖాస్తులు చేసుకోవాలని టీయూటీడబ్ల్యూఆర్‌జేసీ వాజేడు ప్రిన్సిపాల్ కేబీ కిరణ్మయి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా ఆదేశాల మేరకు మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి రీజియన్‌లలోని గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కోరారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చేరడానికి ఈ నెల 16న ఏటూరునాగారంలోని ఆర్‌జేసీ కళాశాలలో ఈ మేరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అర్హులైన గిరిజన విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ మెమో, టీసీ, స్టడీ సర్టిఫికెట్, కులం, ఆదాయం, లోకల్ ఏరియా ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్ రెండు సెట్లు, నాలుగు పాస్ ఫొటోలు తీసుకురావాలని సూచించారు.
‘న్యాయ కళాశాల
ఏర్పాటు చేయాలి’
వాజేడు: భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాలను ఏర్పాటు చేయాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి కోరారు. మండల కేంద్రంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోని చట్టాలు, జీవోలు ప్రతీ ఆదివాసీ యువతీయువకులు తెలుసుకోవాలంటే న్యాయ కళాశాల ఏర్పాటు తప్పనిసరి అని తెలిపారు. చట్టాలపై అవగాహన పెంచుకొని రిజర్వేషన్లను పొందే విధంగా అవగాహన పెరుగుతుందని వెల్లడించారు. ప్రభుత్వం భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
గోవిందరావుపేట: కార్మిక చట్టాలను నర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20 దేశ వ్యాప్తంగా ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ పిలుపునిచ్చారు. ఈ మేరకు మండలకేంద్రంలో శనివారం నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మిక చట్టాలను సవరణ చేస్తూ 12గంటల పని దినాన్ని తీసుకురావడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. రైతుల చట్టాలను రద్దు చేశామని చెప్పి దొడ్డిదారిన మరోసారి రైతులపై భారం మోపడానికి కుట్రపన్నుతుందని ఆరోపించారు. అసంఘటిత రంగంలో కార్మికులకు కనీస వేతనాలు అమలుకావడం లేదన్నారు. కార్మికులకు కనీస భద్రత లేదని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి చేపట్టిన బంద్‌తో పాటు సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలన్నారు.