
బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలన
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో ఈ నెల 8నుంచి 17 వరకు జరుగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాల(జాతర) సందర్భంగా ఆలయంలో వివిధ అభివృద్ధి పనులు, భక్తుల సౌకర్యార్ధం చేస్తున్న ఏర్పాట్లను అదనపు కలెక్టర్ చీమలపాటి మహేందర్‌జీ, ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్సై టీవీఆర్ సూరితో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా గుట్టపై తాత్కాలికంగా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ఏర్పాటు చేసిన డ్రెస్సింగ్ రూమ్‌లు, నీడకోసం ఏర్పాటు చేస్తున్న తడుకల పందిల్లు, పార్కింగ్ స్థలం, సీసీ రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించారు. అదే విధంగా ఆర్టీసీ బస్సు సౌకర్యాల వివరాలను ఏటూరునాగారం కంట్రోలర్ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. జాతర ప్రారంభం వరకు అన్ని పనులు పూర్తి చేయాలని భక్తులకు సకల సౌకర్యాలు కల్పించే విధంగా పనుల్లో వేగం పెంచాలని ఆలయ ఈఓ సత్యనారాయణ, ఇరిగేషన్, పంచాయతీ, ట్రాన్స్‌కో అధికారులకు తగు సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ భద్రు, పంచాయతీ కార్యదర్శి అజ్మత్ తదితరులు ఉన్నారు.