
సమావేశంలో మాట్లాడుతున్న పీఓ అంకిత్
ఏటూరునాగారం: జిల్లా ఆస్పత్రిలోని స్పెషలిస్ట్ వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలని, పీహెచ్‌సీల్లో 24గంటలు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఐటీడీఏ పీఓ అంకిత్ అన్నారు. మండల కేంద్రంలోని పీఓ ఛాంబర్‌లో జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రితో పాటు అన్ని పీహెచ్‌సీల్లోని వైద్య సిబ్బంది పనితీరును సమీక్షించాలన్నారు. ఆస్పత్రుల ద్వారా రోగులకు అందుతున్న సేవలకు అనుగుణంగా పొరుగు సేవల పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందిని కొనసాగించాలన్నారు. జిల్లాలోని 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న స్టాఫ్‌నర్సు, ల్యాబ్ టెక్నీషియన్ ఎక్స్‌రే, ఫార్మసిస్టులు, కాంటిజెంట్ వర్కర్ల పనితీరుపై నివేదిక ఇవ్వాలన్నారు. ఆరోగ్య మహిళ ప్రోగ్రాం లో భాగంగా ప్రతీ మహిళకు రొమ్ము, గర్భాశయ ముఖ ద్వారా, క్యాన్సర్ లక్షణాలను, అనుమానిత సుఖ వ్యాధులు, ఒవేరియన్ సిండ్రోమ్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉంటే గుర్తించి తగిన చికిత్స అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. మధుమేహం, అధిక రక్తపోటుకు నిరంతరంగా మందులు అందించి వారి వివరాలను ఆన్‌లైన్‌లో భద్రపరచాలని సూచించారు. బర్త్ వెయిటింగ్ హోమ్స్‌ను పునరుద్ధరించి వాటిని గర్భిణులు వినియోగించుకునేలాగా చేయాలన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రం ఏటూరునాగారంలో నిర్మిస్తున్న టీ హబ్‌లో సిబ్బంది కొరకు ప్రతిపాదనలు ఇవ్వాలని సూపరింటెండెంట్ సురేష్‌కుమార్ సూచించారు. ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న రెగ్యులర్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు ములుగు వెలుగు యాప్‌లో అటెండెన్స్ నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ అప్పయ్య, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్, జిల్లా ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీశ్వర్, సామాజిక ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేష్‌కుమార్, టీబీ ప్రోగ్రాం అధికారి రవీందర్, ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి వెంకటేశ్వరరావు, ఎంహెచ్‌ఎన్ ప్రోగ్రాం అధికారి పవన్‌కుమార్, ఎన్‌హెచ్‌ఎం ప్రోగ్రాం అధికారి మహేందర్ పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ అంకిత్