
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అధికారులు
ములుగు: ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు జరగబోయే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం పదో తరగతి పరీక్షలపై మంత్రి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద ఏఎన్‌ఎంలు ఉండాలని తదితర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ జిల్లాలో 115 ఉన్నత పాఠశాలలకు సంబంధించి 21 పరీక్షా కేంద్రాల్లో సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 21 చీఫ్ సూపరింటెండెంట్లు, 22 డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు విధులు నిర్వహించనున్నారని వెల్లడించారు. 3,170 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు కలెక్టర్ వివరించారు. అదే విధంగా ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినందుకు అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి అదనపు కలెక్టర్ వైవీ.గణేశ్, డీఈఓ పాణిని, ఆడిషనల్ ఎస్పీ సదానందం, పోస్టల్ డిపార్ట్‌మెంట్ అధికారి కె. అశోక్, విద్యుత్ శాఖ డీఈఈ నాగేశ్వర రావు, ఆర్టీసీ అధికారి జ్యోత్స్న, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, డీపీఆర్‌ఓ రఫిక్ తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో
మంత్రి సబితా ఇంద్రారెడ్డి