
మాట్లాడుతున్న శ్రీనివాసరావు
ములుగు రూరల్: కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను విస్మరిస్తుందని, దేశంలో నిరంకుశ పాలన కొనసాగిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ మేరకు సీపీఐ ఆధ్వర్యంలో బయ్యారం నుంచి ప్రారంభమైన పోరుయాత్ర బుధవారం మల్లంపల్లికి చేరుకుంది. తొలుత జిల్లా కేంద్రంలో రోడ్డు షో నిర్వహించారు. అనంతరం జంగాలపల్లిలో ఎంఆర్ గార్డెన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని కమలాపూర్ బిల్డ్ ఫ్యాక్టరీని ప్రారంభించకపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో గిరిజన యూనివర్శిటీ, రైల్వే కోచ్, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చి తొమ్మిది సంవత్సరాలు గడిచిన అమలుకు నోచుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం వెలికితీసి ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తానని మాట తప్పారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ కార్మికుల పొట్టకొడుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్ సభ్యులను సైతం అనర్హులుగా ప్రకటించడం మోదీ నియంతపాలనకు నిదర్శనమన్నారు. విభజన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన పోడు భూములకు పట్టాలు, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, దళితులకు మూడెకరాల భూ పంపిణీ చేపట్టాలన్నారు. టీఎస్‌పీఎస్‌సీ లీకేజీల కారణంగా నిజాయతీగా పరీక్షలు రాసిన నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శులు తోట మల్లికార్జున్, రాజ్ కుమార్, భిక్షపతి, రవి, విజయసారధి, రాజారెడ్డి, రాష్ట్ర నాయకులు పంజాల రమేష్, జ్యోతి, సదాలక్ష్మీ, జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్, ముత్యాల రాజు, నర్సయ్య, కొమురయ్య, సారయ్య, తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావు