పనుల్లో వేగం పెంచాలి

పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య  - Sakshi

ములుగు: జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఐడీఓఎస్‌ నిర్మాణం పనుల్లో వేగం పెంచాలని, ఏప్రిల్‌ నెలాఖరు వరకు సీ బ్లాక్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌, మొదటి స్లాబ్‌ పూర్తి చేయాలని కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఇంటిగ్రెటెడ్‌ డిస్ట్రిక్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ (ఐడీఓఎస్‌) నిర్మాణ పనులను కలెక్టర్‌ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రౌండ్‌ లెవెల్‌లో జరుగుతున్న ఏ, బీ, సీ బ్లాక్‌ల్లో పుట్టింగ్‌, డబుల్‌ పుట్టింగ్‌ నాణ్యత లోపించకుండా వేసి ఏప్రిల్‌ నెలాఖరుకు సీ బ్లాక్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌, మొదటి స్లాబ్‌ పూర్తి చేయాలన్నారు. వేసవికాలంలోనే మిగతా ఏ, బీ బ్లాక్‌ల గ్రౌండ్‌ ఫ్లోర్‌ పనులు పూర్తి చేయాలన్నారు. వర్షాకాలంలో నిర్మాణ పనులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. ప్రభుత్వ కార్యాలయంగా కాకుండా, అత్యాధునిక హంగులతో కూడిన అద్భుతమైన కార్పొరేట్‌ ఆఫీస్‌ గా ఐడీఓసీని తీర్చిదిద్దాలన్నారు. అనంతరం ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌లో జరుగుతున్న వాచ్‌మెన్‌ రూం నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. వాచ్‌మెన్‌ రూంను త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. గెస్ట్‌హౌస్‌లోకి ఇతరులకు అనుమతి లేకుండా చూడాలన్నారు. వర్షపు నీరు వృథాగా వెళ్లకుండా ప్రాంగణంలో ఇంకుడు గుంతను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ముందు ఖాళీ స్థలంలో మంచి మొక్కలను నాటాలన్నారు. ఖాళీ స్థలంలో సేద తీరేందుకు సిమెంటు బెంచ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. వాహనాలు పార్కింగ్‌కు స్థలాన్ని చదును చేయాలన్నారు. కలెక్టర్‌ వెంట ములుగు తహసీల్దార్‌ సత్యనారాయణ స్వామి, ఇంజనీర్‌ విష్ణు, ములుగు ఆర్‌ఐ విజేందర్‌, సర్వేయర్‌ సత్యనారాయణ ఉన్నారు.

కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య

Read latest Mulugu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top