ములుగు రూరల్‌:.....

- - Sakshi

ములుగు రూరల్‌: ఉపాధి, ఉత్పాదకతే లక్ష్యంగా పశుదాన యూనిట్‌, జీవాల పెంపకందారులకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో సబ్సిడీ రుణాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన్‌ పేరుతో పెంపకందారులు 50 శాతం సబ్సిడీ అందించి జీవాల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తుంది. ఎన్‌ఎల్‌ఎం పథకం ద్వారా గొర్రెలు, కోళ్లు, పందుల పెంపకానికి రుణాలను మంజూరు చేస్తోంది. ఒక్కో యూనిట్‌ విలువ రూ.10 లక్షల నుంచి కోటి వరకు అందిస్తోంది. ఇందులో అన్ని సామాజిక వర్గాల ప్రజలను అర్హులుగా గుర్తించింది. దీంతో పాటు పరపతి సంఘాలు, సొసైటీలకు రుణాలను మంజూరు చేస్తోంది. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పథకం అమలుకు శ్రీకారం చేపట్టింది.

సబ్సిడీ 50 శాతం

నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన్‌ పథకంలో కేంద్ర ప్రభుత్వం మార్పు చేపట్టింది. పథకం ప్రారంభంలో కేవలం యూనిట్‌ విలువ రూ. కోటి కేటాయించింది. బ్యాంకు రుణం రూ.40 లక్షలు, లబ్ధిదారుడి వాటాధనం 10 లక్షలు, ప్రభుత్వ సబ్సిడీ రూ.50 లక్షలుగా నిర్ణయించింది. యూనిట్‌ విలువలో బ్యాంకు రుణాలను బ్యాంకర్లు నిరాకరించడంతో యూనిట్‌ విలువను తగ్గించింది. దీంతో యూనిట్‌ విలువను ఐదు విభాగాలుగా విభజించి రుణాలు అందజేయాలని సడలించింది. దీంతో యూనిట్‌లో 105 నుంచి 525 గొర్రెల వరకు కొనుగోలు చేసేందుకు రూ.10 లక్షల నుంచి కోటి వరకు రుణాలు ఇస్తోంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకునే విధానం

లబ్ధిదారుడు ఎంపిక చేసుకున్న యూనిట్‌ను బట్టి 2 ఎకరాల భూమి నుంచి 10 ఎకరాల భూమి అవసరం ఉంటుంది. భూమి లేని లబ్ధిదారులు లీజ్‌కు తీసుకొని రుణాలు పొందవచ్చు. లబ్ధిదారుడు యూనిట్‌ పెంచుకునే స్థలంలో పశుగ్రాసం పెంచి బ్యాంక్‌ కాన్‌సెంట్‌ తీసుకు రావాలి. లబ్ధిదారుడు ఒరిజినల్‌ డాక్యుమెంట్లు జత చేస్తూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు కాపీలను జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. చివరి తేదీ లేకుండా లబ్ధిదారుడు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

ఎంపిక విధానం

ఎన్‌ఎల్‌ఎం పథకంలో ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకున్న వారి ఎంపిక కోసం రాష్ట్ర, కేంద్ర స్థాయిలో రెండు కమిటీలు ఉంటాయి. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. లబ్ధిదారుడికి బ్యాంకు రుణం మంజూరైన తరువాత 25 శాతం, యూనిట్‌ గ్రౌండింగ్‌ అయిన తరువాత 25 శాతం సబ్సిడీ నిధులను బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. బ్యాంకు రుణం అవసరం లేని వారు సొంతంగా పెట్టుబడి పెట్టి షెడ్‌లు, పశుగ్రాసం పెంపకం చేపట్టిన అనంతరం సబ్సిడీని పొందవచ్చు.

లక్ష్యం!

ఉపాధి,

ఉత్పాదకతే

పశుదాన యూనిట్‌, గొర్రెలు, కోళ్లు, పందుల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం

యూనిట్‌ విలువ రూ.10లక్షల నుంచి కోటి వరకు సబ్సిడీ రుణాలు

పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పథకం అమలు

Read latest Mulugu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top