
రాస్తారోకో చేస్తున్న డీవైఎఫ్‌ఐ నాయకులు
ములుగు రూరల్(గోవిందరావుపేట): గోవిందరావుపేట మండలం పరిధిలోని పస్రాలో మినరల్ వాటర్ ధరలు తగ్గించాలని డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినరల్ ప్లాంట్ యజమానులు వాటర్ క్యాన్ రేట్లను విపరీంతగా పెంచి సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. పంచాయతీ ఆధ్వర్యంలో విడుదల చేస్తున్న తాగునీరు కలుషితమై ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. కనీసం తాగునీటిని ప్రజలకు అందించని పంచాయతీని ఉత్తమ పంచాయతీగా ఎలా ఎంపిక చేశారని ప్రశ్నించారు. గతంలో పంచాయతీ అధికారులకు వినతిపత్రం అందించిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మినరల్ వాటర్ క్యాన్‌ను రూ. 2కు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకుడు గొంది రాజేష్, మంచాల కవిత, శారద, పద్మ, స్రవంతి, జీవన్, గణేష్, సీతారామరాజు, శ్రీను, అశోక్ తదితరులు పాల్గొన్నారు.