ప్రఖ్యాత సినీ నిర్మాత ఆర్‌బీ చౌదరి మృతి వార్త సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మరణవార్తను షూటింగ్ మధ్యలో విన్న నటుడు విశాల్ తీవ్రంగా కలత చెందారు.
విశాల్ తన భావోద్వేగాలను వ్యక్తం చేస్తూ.. జీవితం ఎంత అనిశ్చితమైనది. భారతదేశంలోని అతిపెద్ద నిర్మాణ సంస్థలలో ఆయన ఒకరు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జీవా, జిథన్ రమేష్, సురేష్, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఈ విషాదం నుండి కోలుకునే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని విశాల్ తన సంతాపాన్ని ప్రకటించారు.
ఆర్‌బీ చౌదరి స్థాపించిన సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించబడ్డాయి. ఆయన తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ వంటి భాషల్లో సినిమాలు నిర్మించి దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన మృతి భారతీయ సినీ రంగానికి తీరని లోటు. ఆర్‌బీ చౌదరి మరణం పట్ల రజినీకాంత్, పవన్ కల్యాణ్, పృథ్వీరాజ్ సుకుమారన్ తమ సంతాపం వ్యక్తం చేశారు. కాగా ఆర్‌బీ చౌదరి ఇవాళ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.


