సినిమా మొత్తం సీరియస్‌గా సాగుతోంది... మరోవైపు ఎమోషన్స్ కూడా కంట తడిపెట్టిస్తున్నాయి... ఇలాంటప్పుడే రిలీఫ్ కోసం ఒక పాట కావాలయ్యా అని ఎవరికైనా అనిపిస్తుంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకైతే గ్రాండ్ లెవెల్‌లో స్పెషల్ సాంగ్ కావాలని ఉంటుంది. అందుకే ప్రతి సినిమాలోనూ స్పెషల్ సాంగ్ పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. రానున్న కొన్ని భారీ బడ్జెట్ చిత్రాల్లో ఈ తరహా పాటలు ఉన్నాయి. అయితే... ఈ స్పెషల్ సాంగ్స్ గురించి యూనిట్ నుంచి అధికారిక ప్రకటన లేదు. కానీ ప్రచారంలో ఉన్న ప్రకారం పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్, నోరా ఫతేహీ ప్రత్యేక పాటల్లో కనిపించనున్నారట. ఆ పాటలు ఏ సినిమాలోనో తెలుసుకుందాం.
హిట్ రిపీట్ అవుతుందా?
టాప్ హీరోయిన్ పూజా హెగ్డే వీలైనప్పుడల్లా స్పెషల్ సాంగ్స్ చేస్తుంటారు. రజనీకాంత్ ‘కూలీ’ చిత్రంలో పూజా హెగ్డే చేసిన ‘మోనికా..’ సాంగ్ సూపర్‌హిట్‌గా నిలిచింది. రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’లో పూజా హెగ్డే చేసిన ప్రత్యేక పాట ‘జిగేల్ రాణి’, వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ‘ఎఫ్ 3’లో చేసిన స్పెషల్ సాంగ్ ‘లైఫ్ అంటే ఇట్లా ఉండాల..’ కూడా చాలా పాపులర్. ఈ పాటల తరహాలోనే మరో హిట్ స్పెషల్ సాంగ్‌ను చేయనున్నారట పూజా హెగ్డే. హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
ఈ మూవీలో దీపికా పదుకోన్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు యూనిట్ ప్రకటించగా, హీరోయిన్స్ జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్నా, భాగ్యశ్రీ భోర్సేలు కూడా ఈ చిత్రంలో భాగమయ్యారనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ సంగతి ఇలా ఉంచితే... ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ సాంగ్ కోసం మేకర్స్ పూజా హెగ్డేని సంప్రదించారనే టాక్ తెరపైకి వచ్చింది.
మరి... అల్లు అర్జున్ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తారా? పూజా హెగ్డే గత ప్రత్యేక పాటల సక్సెస్ రిపీట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో విడుదల కానుందని సమాచారం. ఈ సంగతి ఇలా ఉంచితే... అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ‘అల.. వైకుంఠపుర ములో..’లోని సాంగ్స్ బాగా పాపులర్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది.
మాస్ సాంగ్
రామ్ చరణ్ నటించిన రూరల్ మాస్ మూవీ ‘రంగస్థలం’లోని ‘జిల్ జిల్ జిగేల్ రాణి..’ పాట ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మళ్లీ రామ్‌చరణ్ ఈ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో మరో సినిమా చేస్తున్నారు. అదే ‘పెద్ది’. బుచ్చిబాబు సాన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ పూర్తి కాగానే పాటల చిత్రీకరణను ఆరంభిస్తారు. అయితే బ్యాలెన్స్ ఉన్న సాంగ్ షూట్‌లో స్పెషల్ కూడా ఒకటి ఉందని సమాచారం. ఈ స్పెషల్ సాంగ్‌లో ముగ్గురు హీరోయిన్స్ డ్యాన్స్ చేస్తారనే ప్రచారం సాగింది.
కానీ ఫైనల్‌గా మృణాల్ ఠాకూర్ చేయనున్నారని సమాచారం. అది మాత్రమే కాదు... ఈ చిత్రకథానాయిక జాన్వీ కపూర్ కూడా ఈ పాటలో కనిపిస్తారని భోగట్టా. రామ్ చరణ్, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్‌ల కాంబినేషన్‌లో రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మాసీ సాంగ్ అంటే మాస్ ఫ్యాన్స్‌కు విజిల్ మూమెంట్స్ అనే చెప్పవచ్చు. అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయని ఊహించ వచ్చు. ఏప్రిల్‌లో మొదటి వారంలో ఈ పాట చిత్రీకరణ జరగనుందని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్.
జైలర్‌తో సందడి
‘నువ్వు కావాలయ్యా...’ అంటూ రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ (2023)లో తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. అందుకే ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘జైలర్ 2’లో ఈ తరహా ప్రత్యేక పాట కావాలయ్యా... అంటున్నారు అభిమానులు. అందుకు తగ్గట్టే సీక్వెల్‌లోనూ బ్రహ్మాండమైన స్పెషల్ సాంగ్ ఉందట. ఈ పాటకు నోరా ఫతేహీ డ్యాన్స్ చేశారని కోలీవుడ్ టాక్. రజనీకాంత్–నోరా పాల్గొనగా చెన్నైలో ఎనిమిది రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించారని సమాచారం.
తొలి భాగానికి పాటలు స్వరపరచిన అనిరుధ్ రవిచందర్ ‘జైలర్ 2’కి కూడా సంగీతం అందించారు. తొలి భాగాన్ని తెరకెక్కించిన నెల్సన్ దిలీప్‌కుమార్ మలి భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తొలి భాగాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ సీక్వెల్‌ని నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలోని ప్రత్యేక పాటకు జానీ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారని తెలిసింది. ఇది సౌత్ స్టైల్‌లో సాగే సాంగ్ అని, చాలా గ్రాండ్‌గా చిత్రీకరించారని చెన్నై ఫిల్మ్‌నగర్ అయిన కోడంబాక్కమ్‌లో ప్రచారమవుతోంది.
ఇదిలా ఉంటే... తెలుగు, తమిళ, హిందీ... ఇలా పలు భాషల్లో నోరా ఫతేహీ ఇప్పటివరకూ ఎన్నో ప్రత్యేక పాటలు చేశారు. వాటిలో ఎన్టీఆర్ ‘టెంపర్’లోని ‘ఇట్టాగే రెచ్చిపోదాం పిల్లా..’, ప్రభాస్ ‘బాహుబలి’లోని ‘మనోహరీ...’ పాటలు కూడా ఉన్నాయి. మరి... ‘జైలర్ 2’లోని పాటకు నోరా ఏ స్థాయిలో డ్యాన్స్ చేశారో జూన్‌లో తెలిసిపోతుంది. ఆ నెలలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది.


