
ఫారిన్‌లో తెలుగు సినిమాల రిలీజ్‌లు
విదేశీ మార్కెట్‌పై ఫోకస్
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కనిపిస్తుంటుంది. నిన్న మొన్నటి వరకు తెలుగు హీరోలు, దర్శక–నిర్మాతలు పాన్ ఇండియా మంత్రం జపించారు. ఇప్పుడు పాన్ వరల్డ్’ అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విదేశీ భాషల్లోనూ తెలుగు సినిమాలను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలా పాన్ వరల్డ్ రిలీజ్ ప్లాన్‌లో ఉన్న చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.
తెలుగు సినిమా హీరోలు, దర్శక–నిర్మాతలే కాదు.. బాలీవుడ్, కన్నడ వంటి సినీ పరిశ్రమలు కూడా హాలీవుడ్ మార్కెట్‌పై దృష్టి సారించాయి. భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా హిందీలో ‘రామాయణ’ అనే సినిమా రూ పొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. కాగా ‘రామాయణ’ సినిమా రెండు భాగాలను దాదాపు 4 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూ పొందిస్తున్నామని, హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం ఈ సినిమా తీసి పోదని ఈ చిత్రనిర్మాత నమిత్ మల్హోత్రా ఓ సందర్భంలో తెలిపారు.
అలాగే విదేశీ ప్రేక్షకులు సైతం మెచ్చుకునేలా ‘రామాయణ’ సినిమాను తీస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా ‘రామాయణ’ సినిమాను విదేశీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్లుగా ఆయన పరోక్షంగా వెల్లడించారు. ‘రామాయణపార్ట్ 1’ చిత్రం వచ్చే ఏడాది దీపావళికి, ‘రామాయణపార్ట్ 2’ చిత్రం ఆపై వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానున్నాయి.
ఇంకా రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’, యశ్ ‘టాక్సిక్’ చిత్రాలు కొన్ని భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్ వెర్షన్స్‌ను కూడా రిలీజ్ చేయనున్నాయి. ఈ విధంగా విదేశీ మార్కెట్‌పై భారతీయ ఫిల్మ్‌మేకర్స్ దృష్టి పెట్టారు. ఇక ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం ఈ అక్టోబరు 2న విడుదల కానుండగా, ‘టాక్సిక్’ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానుంది.
అవతార్‌ను మించి..!
హాలీవుడ్‌లో ప్రంపచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలుగా చెప్పుకునే ‘అవతార్’, ‘అవెంజర్స్’ వంటివి దాదాపు వంద దేశాల్లో విడుదలయ్యాయి. అలాంటిది హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లోని ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ (వర్కింగ్ టైటిల్) మాత్రం అంతకు మించి, 120కిపైగా దేశాల్లో రిలీజ్ అయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసి పోదని.
ఇంకా చెప్పాలంటే... హాలీవుడ్ చిత్రాలకే పోటీగా నిలుస్తున్న సినిమా ఇది. పైగా ఈ సినిమా అప్‌డేట్స్‌కి కూడా గ్లోబల్ రీచ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ఈ ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ29’ సినిమా ఫస్ట్ లుక్‌ను ‘టైటానిక్, అవతార్’ వంటి మూవీస్‌ని డైరెక్ట్ చేసిన జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా రిలీజ్ చేసేందుకు రాజమౌళి అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోందని తెలిసింది.
నవంబరులో తన సినిమా ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రమోషన్స్‌లో భాగం దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇండియాకు రానున్నారని, ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేయించేలా రాజమౌళి ఏర్పాట్లు చేస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇలా చేస్తే ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ రీచ్ గ్లోబల్ స్థాయిలో ఉంటుందన్నది టీమ్ ఆలోచనగా తెలుస్తోంది.
⇒ ఇక ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కెన్యాలో జరుగుతోంది. ఈ చిత్ర హీరో మహేశ్‌బాబుతోపాటుగా ఇతర ప్రధాన తారాగణం ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ సుకుమారన్‌పాల్గొంటుండగా ఆఫ్రికా అడవుల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.1200 కోట్లు అని, ఈ సినిమాకు ‘జెన్ –63’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని, దాదాపు 20కిపైగా భాషల్లో ఈ సినిమాను అనువదించి, 2027 మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమాలో క్రిస్ హెమ్స్‌వర్త్ వంటి హాలీవుడ్ నటులు కూడా కనిపిస్తారని, ఇందుకు సంబంధించి ఓ ప్రముఖ హాలీవుడ్ యాక్టింగ్ ఏజెన్సీతో రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నారనే వార్తలు ఉన్నాయి. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
ఫారిన్ స్పిరిట్
ప్రభాస్ ది ఇంటర్‌నేషనల్ హీరో కటౌట్. ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి, కల్కి2898 ఏడీ’ వంటి చిత్రాలు జపాన్ దేశంలో విడుదలై, అక్కడి ప్రేక్షకులను అలరించాయి. ఇక ప్రభాస్ హీరోగా నటించనున్న చిత్రాల్లో ‘స్పిరిట్’ కూడా ఒకటి. ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.
యూవీ క్రియేషన్స్, టీ–సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనున్నాయి. అయితే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సమయంలోనే ‘స్పిరిట్’ను భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్, చైనా, జపాన్, కొరియా భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. దీంతో ‘స్పిరిట్’ చిత్రం ఇంటర్‌నేషనల్ లెవల్లో రిలీజ్ కానుంది. ఇంకా ‘స్పిరిట్’ సినిమా చిత్రీకరణ మొదలు కాలేదు. రిలీజ్ సమయానికి ‘స్పిరిట్’ మరిన్ని విదేశీ భాషల్లో రిలీజ్ అయ్యే అవకాశాలు లేక పోలేదు.
ఇక ఈ చిత్రంలో తొలిసారిగా ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటించనున్నారు. నిజానికి ఈ సినిమా చిత్రీకరణ ఈపాటికే మొదలు కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతోంది. కాగా ఈ సినిమాలోని ఓ మేజర్ షూటింగ్ షెడ్యూల్‌ను మెక్సికోలో ప్లాన్ చేసినట్లుగా ఈ చిత్రదర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించిన విషయం గుర్తుండే ఉంటుంది.
ఇంకా ఈ చిత్రంలో సౌత్ కొరియన్ నటుడు డాన్ లీ విలన్‌గా నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. డాన్ లీతో తెలుగు నటుడు శ్రీకాంత్ ఉన్న ఫొటోలు ఇంటర్ నెట్‌లో వైరల్ అయ్యాయి. దీంతో..‘స్పిరిట్’ చిత్రంలో డాన్ లీ, శ్రీకాంత్ ఏమైనా భాగం అయ్యారా? అనే టాక్ తెరపైకి వచ్చింది. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
గ్లోబల్ డ్రాగన్
హీరో ఎన్టీఆర్–దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూ పొందుతున్న సినిమా ‘డ్రాగన్’. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మలయాళ నటుడు టొవినో థామస్ విలన్‌గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సమయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెరపైకి వచ్చాయి. ఈ సినిమాను దాదాపు 15 దేశాల్లో చిత్రీకరించాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారన్నది ఆ వార్తల సారాంశం. ఇందుకు తగ్గట్లుగానే ఈ ‘డ్రాగన్’ కోసం ఇంటర్‌నేషనల్ కనెక్ట్‌విటీ ఉండే ఓ ప్రపంచాన్ని ప్రశాంత్ నీల్ క్రియేట్ చేస్తున్నారనే టాక్ తాజాగా తెరపైకి వచ్చింది.
అంతేకాదు... ఈ సినిమా విదేశీ షూటింగ్ షెడ్యూల్స్ నవంబరులో ప్రారంభం అవుతాయట. మరి... ఇంటర్‌నేషనల్ కనెక్టివిటీ ఉన్న స్టోరీని రెడీ చేసుకుని, ఇంటర్‌నేషనల్ లొకేషన్స్‌లో చిత్రీకరణకు ప్లాన్ చేసినప్పుడు, ఇంటర్‌నేషనల్ రేంజ్ రిలీజ్‌ను కూడా ప్లాన్ చేయకుండా ఉంటారా? ‘డ్రాగన్’ టీమ్ ఈ దిశగా ఆలోచిస్తోందట. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిల్మ్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ సినిమా 2026 జూన్ 25న విడుదల కానుంది.
ఇదిలా ఉంటే... ‘ఆర్‌ఆర్‌ఆర్’ (ఇందులో రామ్‌చరణ్ మరో హీరో) చిత్రంలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎన్టీఆర్. ఈ సినిమా ఆస్కార్ క్యాంపైన్ ప్రమోషన్స్‌లో ఉత్సాహంగాపాల్గొన్నారు ఎన్టీఆర్. ఈ విధంగా ప్రపంచవ్యాప్త సినిమా ఆడియన్స్‌కు ఎన్టీఆర్ గురించి ఓ అవగాహన ఉంది.
ఇంటర్‌నేషనల్ పెద్ది
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలకు ఓ సౌలభ్యం ఉంటుంది. భాష అర్థం కాక పోయినా గేమ్, ఇందులోని స్ట్రాటజీస్ ఏ భాషవారికైనా కనెక్ట్ అవుతాయి. హిందీలో ‘మేరికోమ్, భాగ్ మిల్కా సింగ్, చక్ దే ఇండియా’ వంటి సినిమాలు వచ్చినప్పుడు ఇక్కడి తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాలను హిందీ భాషలోనే చూసి, ఈ చిత్రాలను సూపర్ హిట్ చేశారు. ఇప్పుడు ‘పెద్ది’ టీమ్ కూడా ఇదే చేయనుందట. కాక పోతే ఇంటర్‌నేషనల్ లెవల్లో. రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకుడు.
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతిబాబు, దివ్యేందు శర్మ, శివరాజ్‌కుమార్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ మైసూర్‌లో జరుగుతోంది. రామ్‌చరణ్‌పాల్గొంటుండగా ఓపాటతోపాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న విడుదల కానుంది.
కాగా ఈ సినిమాను గ్లోబల్ స్థాయిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. మంచి ఎమోషన్స్ ఉన్న స్పోర్ట్స్ డ్రామా కాబట్టి యూనివర్సల్ అప్పీల్ ఉంటుందని టీమ్ భావిస్తోందట. ఈ దిశగా ప్రయత్నాలను మొదలు పెట్టిందట టీమ్. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్’ (ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరో హీరో) చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా రామ్‌చరణ్‌కు క్రేజ్ వచ్చింది. ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్స్‌లోనూ రామ్‌చరణ్ ఉత్సాహంగాపాల్గొన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో రామ్‌చరణ్ పెర్ఫార్మెన్స్‌ను కొందరు హాలీవుడ్ దర్శకులు మెచ్చుకున్నారు. ఇదంతా ‘పెద్ది’ సినిమాను ఇంటర్‌నేషనల్ ఆడియన్స్‌కు దగ్గర చేయడంలో ఉపయోగపడుతుందని టీమ్ భావిస్తోందని ఫిల్మ్‌నగర్ భోగట్టా.
హాలీవుడ్ అసోసియేషన్
‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ బాగా పెరిగింది. ‘పుష్ప:ది రూల్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో అల్లు అర్జున్ అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు అట్లీ డైరెక్టర్. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం సన్నాహాలు కూడా మొదలుపెట్టింది.
హాలీవుడ్‌లో ‘అవతార్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, డ్యూన్, జురాసిక్ వరల్డ్’ వంటి సినిమాల ప్రమోషన్స్‌లో క్రీయాశీలకంగా వ్యవహరించిన హాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ ‘కనెక్ట్ మాబ్ సీన్’తో అల్లు అర్జున్–అట్లీ టీమ్ అసోసియేట్ అయ్యేందుకు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భాగంగానే ‘కనెక్ట్ మాబ్ సీన్’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రియేటివ్ కంటెంట్ అలెగ్జాండ్రా ఈ. విస్కోంటి ఇటీవల ముంబై వచ్చి, అల్లు అర్జున్–అట్లీ అండ్ టీమ్‌ని కలిసి మాట్లాడారు. ‘కనెక్ట్ మాబ్ సీన్’తో అసోసియేషన్ దాదాపు ఓకే అయ్యిందని, త్వరలోనే అధికారిక ప్రకటన ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.
⇒ కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. అల్లు అర్జున్‌తోపాటు ఈ చిత్రంలోని కీలక తారాగణంపాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇక ఈ సినిమాలో దీపికా పదుకోన్ ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కథ రీత్యా ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్‌కు స్కోప్ ఉందని, దీపికా పదుకోన్ ,మృణాల్ ఠాకూర్ కన్ఫార్మ్ అయ్యారని, మిగతా హీరోయిన్స్‌గా జాన్వీ కపూర్, ఆలియా.ఎఫ్, భాగ్యశ్రీ బోర్సే వంటివారు కనిపించే అవకాశం ఉందనే టాక్ తెరపైకి వచ్చింది.
ఇంకా ఈ చిత్రంలో రమ్యకృష్ణ, యోగిబాబు, విజయ్ సేతుపతి వంటి వారు ఇతర కీలకపాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు... ఈ చిత్రంలో అల్లు అర్జున్ నాలుగుపాత్రల్లో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. తాత – తండ్రి–ఇద్దరు కొడుకులపాత్రల్లో అల్లు అర్జున్ కనిపిస్తారట. ఇక అల్లు అర్జున్ కెరీర్‌లోని ఈ 22వ సినిమా 2027 ఆగస్టులో రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతోంది.
ది ప్యారడైజ్
‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నాని–దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూ పొందుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది. కాగా ‘ది ప్యారడైజ్’ సినిమాను కొన్ని భారతీయ భాషలతోపాటు స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
ఇందుకు తగ్గట్లుగానే హాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ ‘కనెక్ట్ మాబ్ సీన్’ సంస్థతో ఇటీవల చర్చలు జరిపారు మేకర్స్. అంతేకాదు... ‘ది ప్యారడైజ్’ సినిమా ఇంటర్‌నేషనల్ వెర్షన్ రిలీజ్ కోసం ఓపాపులర్ హాలీవుడ్ యాక్టర్‌తో అసోసియేట్ కావాలనుకుంటున్నారు మేకర్స్. ఈ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. త్వరలోనే ఈ విషయంపై మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
వీరే కాదు.. మరికొంతమంది తెలుగు హీరోలు కూడా తమ మార్కెట్ పరిధిని గ్లోబల్ స్థాయిలో పెంచుకునేందుకు ఇప్పట్నుంచే వ్యూహ రచనలు చేస్తున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. – ముసిమి శివాంజనేయులు