Shabaash Mithu: సండే సినిమా ఉమన్‌ ఇన్‌ బ్లూ

Shabaash Mithu Movie Review: Mithali Raj Biopic Special Story - Sakshi

‘మెన్‌ ఇన్‌ బ్లూ’ అంటే భారత క్రికెట్‌ జట్టు. అంటే మగ జట్టు. క్రికెట్‌ మగవారి ఆట. క్రికెట్‌ కీర్తి మగవారిది. క్రికెట్‌ గ్రౌండ్‌ మగవారిది. కాని ఈ ఆటను మార్చే అమ్మాయి వచ్చింది. ‘మెన్‌ ఇన్‌ బ్లూ’ స్థానంలో ‘ఉమెన్‌ ఇన్‌ బ్లూ’ అనిపించింది. స్త్రీలు క్రికెట్‌ ఆడలేరు అనే విమర్శకు తన బ్యాట్‌తో సమాధానం ఇచ్చింది. ‘మిథాలి రాజ్‌’ మన హైదరాబాదీ కావడం గర్వకారణం. ఆమె బయోపిక్‌ ‘శభాష్‌ మిథు’ తాజాగా విడుదలైంది. అంచనాలకు తగ్గట్టు లేకపోయినా స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది.

సినిమాలో ఒక ప్రెస్‌మీట్‌లో మిథాలి రాజ్‌ పాత్రధారి అయిన తాప్సీ పన్నును అడుగుతాడు జర్నలిస్టు– మీ ఫేవరెట్‌ పురుష క్రికెటర్‌ ఎవరు? అని. దానికి తాప్సీ ఎదురు ప్రశ్న వేస్తుంది– ఈ ప్రశ్నను మీరెప్పుడైనా పురుష క్రికెటర్లను అడిగారా... వాళ్ల అభిమాన మహిళా క్రికెటర్‌ ఎవరు అని? మిథాలి రాజ్‌ నిజ జీవితంలో జరిగిన ఈ ఘటన సినిమాలో అంతే ప్రభావవంతంగా ఉంటుంది. ఏ ప్రశ్న ఎవరికి వేయాలో కూడా మన సమాజంలో ‘కండీషనింగ్‌’ ఉంటుంది.

మహిళా క్రికెట్‌ బోర్డును బిసిసిఐలో విలీనం చేశాక (సినిమాలో) టీమ్‌ యూనిఫామ్స్‌ పంపమంటే పురుష జట్టు వాడేసిన యూనిఫామ్స్‌ను పంపుతారు. ‘మా పేర్లతో మాకు బ్లూ కలర్‌ యూనిఫామ్స్‌ కావాలి’ అని మిథాలి డిమాండ్‌ చేస్తుంది. దానికి బిసిసిఐ చైర్మన్‌ ముప్పై ఏళ్లుగా అక్కడ పని చేస్తున్న ప్యూన్‌ను పిలిచి ‘నీకు తెలిసిన మహిళా క్రికెటర్ల పేర్లు చెప్పు?’ అంటాడు. ప్యూన్‌ చెప్పలేకపోతాడు. ‘మీ గుర్తింపు ఇంత. మీకు ఇవి చాలు’ అంటాడు. మిథాలి ఆ మాసిన యూనిఫామ్‌ను అక్కడే పడేసి వచ్చేస్తుంది.

మన దేశంలో మహిళలు చదువులోనే ఎంతో ఆలస్యంగా రావాల్సి వచ్చింది. ఇక ఆటల్లో మరింత ఆలస్యంగా ప్రవేశించారు. అసలు ఆటల్లో ఆడపిల్లలను, యువతులను ప్రోత్సహించాలన్న భావన సమాజానికి, ప్రభుత్వాలకు కలగడానికి కూడా చాలా సమయం పట్టింది. ఒకవేళ వాళ్లు ఆడుతున్నా మన ‘సంప్రదాయ ఆలోచనా విధానం’ వారికి అడుగడుగున ఆంక్షలు విధిస్తుంది.

సినిమాలో/ నిజ జీవితంలో మిథాలి రాజ్‌ కుటుంబం మొదట కొడుకునే క్రికెట్‌లో చేరుస్తుంది. సినిమాలో కొంత డ్రామా మిక్స్‌ చేసి కూతరు కూడా క్రికెట్‌లో ప్రవేశించినట్టు చూపారు. నిజ జీవితంలో మిథాలి బాల్యంలో బద్దకంగా ఉంటోందని ఆమెను కూడా క్రికెట్‌లో చేర్చాడు తండ్రి. సోదరుడి ఆట కంటే మిథాలి ఆట బాగుందని కోచ్‌ చెప్పడంతో మిథాలి అసలైన శిక్షణ మొదలవుతుంది. ఆమె ఎలా ఎదిగిందనేది ఈ సినిమా చూపిస్తుంది.

1983లో భారత జట్టు ‘వరల్డ్‌ కప్‌’ సాధించాక క్రికెట్‌ ఆటగాళ్లకు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. క్రికెట్‌లో వ్యాపారాన్ని కనిపెట్టిన బిసిసిఐ విపరీతంగా మేచ్‌లు ఆడిస్తూ ఆటగాళ్లను పాపులర్‌ చేసింది. టెస్ట్‌లు, వన్‌డేలు, టూర్లు ఇవి క్రికెట్‌ను మరపురానీకుండా చేశాయి. 1987 ‘రిలయన్స్‌ కప్‌’ నాటికి ఈ దేశంలో క్రికెట్‌ ఎదురు లేని క్రీడగా అవతరించింది. మహిళా క్రికెట్‌ జట్టు 1978 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్నా వరల్డ్‌ కప్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నా దాని గురించి ఎవరికీ తెలియదు.

ఎవరూ పట్టించుకోలేదు. మిథాలి రాజ్‌కు ముందు భారత మహిళా క్రికెట్‌లో మంచి మంచి ప్లేయర్లు ఉన్నా మిథాలి రాజ్‌ తర్వాత పరిస్థితి మారింది. 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి ఆడిన తొలి మేచ్‌లోనే సెంచరీ కొట్టిన అద్భుత ప్రతిభ మిథాలిది. అతి చిన్న వయసులో ఆమె కెప్టెన్‌ అయ్యింది. 2013, 2017 ప్రపంచ కప్‌లలో ఆమె వల్ల టీమ్‌ ఫైనల్స్‌ వరకూ వెళ్లింది.

టెస్ట్‌లలో, వన్‌ డేలలో, టి20లో అన్నీ కలిపి దాదాపు 10 వేల పరుగులు చేసిన మిథాలి ప్రపంచంలో మరో మహిళా క్రికెటర్‌కు లేని అలాగే పురుష క్రికెటర్‌లకు లేని అనేక రికార్డులు సొంతం చేసుకుంది. అయితే సినిమాలో చూపినట్టు ఆమెకు సౌకర్యవంతమైన జీవన నేపథ్యం ఉంది. కాని జట్టులో ఉన్న మిగిలిన సభ్యులు భిన్న నేపథ్యాలు, అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వారు. మిథాలీకి, ఈ సభ్యులకు మధ్య సఖ్యత కుదరడం వారందరిలో ఒక టీమ్‌ స్పిరిట్‌ రావడం... ఇదంతా ఈ సినిమాలో చూడొచ్చు. మహిళా జట్టుగా తాము ఎదుర్కొన్న తీవ్ర వివక్ష, ఆశ నిరాశలు, మరోవైపు పురుష జట్టు ఎక్కుతున్న అందలాలు... ఇవన్నీ సినిమాలో ఉన్నాయి.

మిథాలి రాజ్‌ బయోపిక్‌గా వచ్చిన ‘శభాష్‌ మిథు’ బహుశా హైదరాబాద్‌ ఆటగాళ్ల మీద వచ్చిన మూడో బయోపిక్‌. దీనికి ముందు అజారుద్దీన్‌ మీద ‘అజార్‌’, సైనా నెహ్వాల్‌ మీద ‘సైనా’ వచ్చాయి. అవి రెండు నిరాశ పరిచాయి. ‘శభాష్‌ మిథు’ ఇంకా బాగా ఉండొచ్చు. దర్శకుడు శ్రీజిత్‌ ముఖర్జీ మిథాలి కేరెక్టర్‌ గ్రాఫ్‌ను పైకి తీసుకెళ్లడంలో విఫలమయ్యాడు. గొప్ప ఎమోషన్‌ తీసుకురాలేకపోయాడు. క్లయిమాక్స్‌ను ఆట ఫుటేజ్‌తో నింపడం మరో లోపం. ఈ సినిమా మరింత బడ్జెట్‌తో మరింత పెద్ద దర్శకుడు తీయాలేమో అనిపిస్తుంది.

అయినా సరే ఈ కాలపు బాలికలకు, యువ క్రీడాకారిణులకు ఈ సినిమా మంచి బలాన్ని ఇస్తుంది. ధైర్యాన్ని ఇచ్చి ముందుకు పొమ్మంటుంది. క్రీడల్లో సత్తా చాటుకోమంటుంది. తల్లిదండ్రులను, సమాజాన్ని ఆడపిల్లలను క్రీడల్లో ప్రోత్సహించమని చెబుతుంది.
ఏ నిరాడంబర ఇంటిలో ఏ మిథాలి రాజ్‌ ఉందో ఎవరికి తెలుసు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top