‘సతీ లీలావతి’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Sathi Leelavathi Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

‘సతీ లీలావతి’ మూవీ రివ్యూ : మెగా కోడలు మూవీ హిట్టా? ఫట్టా?

May 8 2026 3:29 PM | Updated on May 8 2026 3:34 PM

Sathi Leelavathi Movie Review And Rating In Telugu

పెళ్లి తర్వాత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది లావణ్య త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సతీ లీలావతి’. దేవ్ మోహన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి  భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ట్రైలర్‌ని ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దానికి తోడు భారీ ప్రమోషన్స్‌ చేయడంతో ‘సతీ లీలావతి’పై హైప్‌ క్రియేట్‌ అయింది. మంచి అంచాల మధ్య నేడు(మే 8) ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగా కోడలు సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
లీలావతి (లావణ్య త్రిపాఠి) ఓ స్టార్‌ డైరెక్టర్‌. ఇంట్లో పెరెంట్స్‌ తరచూ గొడవలు పడడంతో చిన్నప్పటి నుంచి ఆమెలో ఓ భయం ఏర్పడుతుంది. ఆ భయం నుంచి బయటపడేందుకు సైకాలజిస్ట్‌ రామ్‌ సేతు(దేవ్‌ మోహన్‌)ని సంప్రదిస్తుంది. ఈ క్రమంలో అతనితో స్నేహం ఏర్పడడం.. అది కాస్త ప్రేమగా మారి, నాన్న(నరేశ్‌) అనుమతిలో పెళ్లి కూడా చేసుకుంటుంది. మూడేళ్ల పాటు చక్కగా కాపురం చేసిన రామ్‌.. ఉన్నపళంగా విడాకులు కోరతాడు.  ప్రస్తుతం తాను  నర్స్‌ నికోలా సెబాస్టియన్‌ (మడోన్నా సెబాస్టియన్‌)తో  రిలేషన్‌లో ఉన్నానని.. విడాకులు ఇస్తే ఆమెను పెళ్లి చేసుకుంటానని చెబుతాడు. విడిపోవడం ఇష్టంలేని లీలావతి..భర్తను కొట్టి ఇంట్లోనే బంధిస్తుంది.  ఆ తర్వాత ఏం జరిగింది? అసలు సేతు నేపథ్యం ఏంటి? నర్స్‌ నికోల అతని జీవితంలోకి ఎలా వచ్చింది? భర్తను దక్కించుకునేందుకు లీలావతి ఏం చేసింది? లాయర్‌ తమలపాకుల(వీటీవీ గణేష్‌)కు ఆమె చెప్పిన అబద్దం ఏంటి?  ఆమెకు దొంగ(సప్తగిరి), నిర్మాత మొట్ట రాజర్‌(మొట్ట రాజేంద్రన్‌) ఎలాంటి సహాయం చేశారు? చివరకు లీలావతి-రామ్‌సేతు విడాకులు తీసుకున్నారా ? లేదా తిరిగి ఒక్కటయ్యారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే.. 
విడాకులు అనేది ఇప్పుడు కామన్‌ అయిపోయాయి. నేటి బిజీ లైఫ్‌లో చిన్న చిన్న విషయాలకు గొడవపడి విడిపోతున్న జంటలు చాలానే ఉంటున్నాయి. అలా విడిపోవడం కరెక్ట్‌ కాదని.. భార్యాభ‌ర్త‌ల‌ బంధానికి మ‌ర‌ణంతోనే ముగింపు ఉండాలని సందేశం ఇచ్చిన చిత్రం ‘సతీలీలావతి’.‍ దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌, ఇచ్చిన మేసేజ్‌ నేటి ట్రెండ్‌కి తగ్గట్లుగా ఉంది కానీ..దాన్ని తెరపై ఆకట్టుకునేలా చూపించడంలో మాత్రం కాస్త తడపడ్డాడు. 

జెన్‌జీ బ్యాచ్‌ని ఆకట్టుకునేలా లీలావతి, సేతుల మధ్య గొడవలను కాస్త వయెలెంట్‌గా చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఇద్దరి పరిచయం.. ప్రేమ, పెళ్లి, గొడవ..ఇదంతా కొంతవరకు ఆకట్టుకునేలా ఉన్నా.. ఎప్పుడైతే భార్య చేతిలో సేతు బంధి అవుతాడు..అప్పటి నుంచి కథనం మలుపు తిరుగుతుంది. కామెడీ కోసమే కొన్ని పాత్రలను ప్రవేశ పెట్టి.. అసలు కథను పక్కదారి పట్టించారు. 

అయితే ఆ కామెడీ సన్నివేశాలు కొన్ని చోట్ల నవ్వించినా.. మరికొన్ని చోట్ల మాత్రం అనవసరం అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ వరకు కథనం కాస్త ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. లీలా తనలో ఉన్న దర్శకత్వ ప్రతిభను ఉపయోగించుకొని.. కాపురాన్ని ఎలా చక్కదిద్దుకుందనేది సెకండాఫ్‌ స్టోరీ. అయితే ఆమె వేసే ప్లాన్స్‌ మరీ సినిమాటిక్‌గా అనిస్తాయి. కిడ్నాప్‌ డ్రామాతో పాటు స్పైడర్‌ మ్యాన్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ నవ్వులు పూయిస్తుంది. ఇక క్లైమాక్స్‌ కాస్త భావోద్వేగానికి గురి చేస్తుంది.

ఎవరెలా చేశారంటే.. 
లీలావతి పాత్రకి లావణ్య న్యాయం చేసింది. తెరపై అందంగా కనిపిస్తూనే.. తనదైన నటనతో ఆకట్టుకుంది. కామెడీ కూడా బాగానే చేసింది. భర్త చేతిలో బంధీగా మారిన సేతు పాత్రలో దేవ్‌ మోహన్‌ ఉన్నంతలో బాగానే చేశాడు.  నరేశ్, వీటీవీ గణేశ్, మడోన్నా, సప్తగిరితో పాటు మిగిలిన నటీనటులంతా తమ పాత్ర పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు.  మిక్కీ జే మేయ‌ర్ పాట‌లు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఓకే. బినేంద్ర మేనన్‌ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్‌ అని చెప్పొచ్చు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 
 

Rating:
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement