
వెర్రీ వెయ్యి రకాలు అనే సామెత అందరం వినే ఉంటాం. అలాగే అనిపిస్తుంది ఈ మెక్సికన్ ర్యాపర్ డాన్ సుర్ చేసిన పని చూస్తే. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ర్యాపర్లు ఉన్నారు. వారందరూ తమ మ్యూజిక్‌తో మాత్రమే కాకుండా జుట్టుకు రంగులు, విచిత్ర వేషధారణలతోనూ పాపులర్ అవుతుంటారు. కానీ ఈ 23 ఏళ్ల ర్యాపర్ ఏకంగా బంగారు గొలుసులను జుట్టుగా పెట్టించుకొని అందరినీ ఆశ్యర్యంలో ముంచేశాడు.
కొత్త లుక్ గురించి తన అభిప్రాయాలను ఓ మీడియా హౌస్‌తో పంచుకున్నాడు డాన్ సుర్. అందులో.. ‘ఎంతోమంది ర్యాపర్లు జుట్టుకు రంగువేసుకోవడం చూశాను. ఎవరూ కాపీ కొట్టకుండా వెరైటీగా ఉండాలని ప్రయత్నించాలనుకున్నాను. అందుకే నా తలలో హుక్ పెట్టించుకుని బంగారు గొలుసులను జుట్టుగా మార్చుకున్నాను’ అని డాన్ సుర్ తెలిపాడు. బంగారు జుట్టు పెట్టించుకున్న వారిలో తనే మొదటి వాడినని అతను మురిసిపోయాడు.
ఈ జుట్టు తన కెరీర్‌కు ఉపయుక్తంగా ఉంటుందని వివరించాడు. తన న్యూ లుక్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఈ కుర్ర ర్యాపర్. దీంతో బంగారు జుట్టుతో ఉన్న ఈ ర్యాపర్ ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. డాన్ సుర్ ఇలాంటి విచిత్ర పనులు చేయడం మొదటిసారి కాదు. ఇంతకుముందు దంతాలకు బంగారంతో తొడుగులు వేయించుకున్నాడు.