● జిల్లాలో 65 సెంటర్లు ● ప్రజలపై అదనపు వ్యయం
ప్రస్తుతం ఏ ధ్రువపత్రం కావాలన్నా మీ సేవ కేంద్రమే ఆధారం. ఇదే తరుణంలో సర్వీస్ చార్జీలను ప్రభుత్వం ఒక్కసారిగా 50 శాతం పెంచింది. ఇప్పటికే జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సాధారణ, మధ్య తరగతి ప్రజలపై అధిక భారం పడుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
– మెదక్ కలెక్టరేట్
జిల్లావ్యాప్తంగా మొత్తం 65 మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఒక ప్రభుత్వ ఈ–సేవ సెంటర్ ఉంది. మొత్తం సుమారు 200 మంది ఆపరేటర్లు నిత్యం వేలాది మందికి ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. 15 ఏళ్ల తర్వాత ప్రభుత్వం సర్వీస్ చార్జీలను పెంచింది. ఈ నిర్ణయం సామాన్యులకు మరింత భారంగా మారగా, కాగా నిర్వాహకుల్లో మాత్రం ఆనందం వ్యక్తమవుతోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు, సేవలను ప్రజలకు సులభంగా, వేగంగా అందించే లక్ష్యంతో 2011లో ప్రభుత్వం మీ సేవ కేంద్రాలను ప్రారంభించింది. ఈ కేంద్రాల ద్వారా 36 డిపార్ట్‌మెంట్లు, 314 సర్వీస్‌లను ప్రజలకు అందిస్తున్నారు. రోడ్డు రవాణాశాఖ, పోలీస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, టీవాలెట్, విద్యుత్‌శాఖ, దేవాదాయశాఖ, వ్యవసాయశాఖ, సీడీఎంఏ వంటి ఇతర సర్వీసులు అందజేస్తున్నారు.
రెండింతలు పెరిగిన సర్వీస్ చార్జీలు
పేద ప్రజలపైనే భారం
పేద విద్యార్థులు పై చదువులు, హాస్టళ్లలో చేరడానికి, సంక్షేమ పథకాలు పొందడానికి అత్యధికంగా రేషన్ కార్డులు, కులం, ఆదాయం, స్థానిక, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకుంటారు. ప్రస్తుతం పెంచిన చార్జీలతో వీరిపై అదనపు భారం పడుతుంది. పెంచిన చార్జీలను ప్రభుత్వం సవరించాలి. – బాల్‌రాజ్, జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు
పెంచిన చార్జీలు ఇలా..
మీ సేవల ద్వారా కులం, ఆదాయం, స్థానిక పత్రాలు పొందాలంటే ఒక్కో సర్టిఫికెట్‌కు గతంలో రూ.45 ఉండగా 50 శాతం చార్జీలతో పాటు 18 శాతం జీఎస్టీ కలుపుకొని రూ. 80 రౌండ్ ఫిగర్ చేశారు. అలాగే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు గతంలో రూ.85 ఉండగా, ప్రస్తుతం రూ.130కు పెంచారు.


