పోక్సో చట్టం.. రక్షణ కవచం | - | Sakshi
Sakshi News home page

పోక్సో చట్టం.. రక్షణ కవచం

Apr 16 2026 11:59 AM | Updated on Apr 16 2026 11:59 AM

మెదక్‌జోన్‌: పోక్సో చట్టం చిన్నారులకు రక్షణ కవచంలా నిలుస్తోంది. కేవలం రెండు నెలల వ్యవధిలో 8 మంది దోషులకు జైలు శిక్ష వేయగా, వారిలో ఆరుగురికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. మరో ఇద్దరికి మూడేళ్ల జైలు శిక్ష విధించారు. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ చట్టంపై మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.

2021లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు

పోక్సో 2012లో ఆవిర్భవించగా జిల్లాలో 2021లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. కాగా గతేడాది వరకు ఇన్‌చార్జి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌తో కొనసాగించగా, 2025 జూన్‌లో పోక్సో కోర్టుకు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను నియమించారు. కాగా గడిచిన 2 నెలల్లో 8 మంది నిందితులకు శిక్ష పడగా, అందులో ఆరుగురికి 20 ఏళ్ల చొప్పున కఠిన కారాగార శిక్షతో పాటు రూ. లక్ష చొప్పున జరిమానా విధించారు. మరో ఇద్దరికి మూడేళ్లజైలు శిక్షతో పాటు రూ. లక్ష చొప్పున జరిమానా విధించి ఆ మొత్తాన్ని బాధిత కుటుంబాలకు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా ఎప్పుడూ లేని విధంగా పోక్సో కోర్టు ఇటీవల రెండు నెలల వ్యవధిలో 8 మంది దో షులకు శిక్షలు విధించటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పరువు ముసుగులో రాజీ

ఏడాది కాలంగా జిల్లాలో 500 పైచిలుకు కేసులు నమోదు కాగా, గడిచిన పది నెలల్లో 350 పైచిలుకు పోక్సో కేసులు ట్రయల్‌కు వచ్చాయి. వాటిలో కేవలం 8 మందికి శిక్షలు పడగా, మిగితా వారు బాధితులతో రాజీపడి కేసుల నుంచి తప్పించుకోగలిగారు. ఇందులో ప్రధానంగా పరువు పోతుందనే భావనతో నింధితులు కోర్టుల్లో సాక్ష్యం చెప్పేందుకు ముందుకు రావటం లేదని తెలిసింది. మరికొంత మంది బాధితులకు డబ్బు ఎరవేసి కేసుల నుంచి తప్పించుకుంటున్నారు.

2 నెలల వ్యవధిలో 8 మందికి శిక్ష

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

చట్టంపై అవగాహన అవసరం

: న్యాయ నిపుణులు

అవగాహన అవసరం

మైనర్లపై అఘాయిత్యాల నేపథ్యంలో పోక్సో చట్టం ఏర్పాటు అయింది. ఈ చట్టం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. పరువు అంటూ కొందరు రాజీపడి కోర్టుల్లో సాక్ష్యాలు చెప్పకపోవడంతో దోషులు శిక్ష నుంచి తప్పించుకోగలుగుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం చట్టంపై అవగాహన లేకపోవటమే.

– బాలయ్య, పోక్సోకోర్టు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌

నిర్భయంగా చెప్పాలి

బాలికలపై అఘాయిత్యాలు తగ్గాలంటే బాధితులు కోర్టులో నిర్భయంగా సాక్ష్యం చెప్పి దోషులకు శిక్షలు పడేలా చేయాలి. అప్పుడే బాలికలపై అఘాయిత్యాలు తగ్గే అవకాశం ఉంటుంది.

– శ్రీనివాసరావు, ఎస్పీ

Advertisement
 
Advertisement
Advertisement