రామాయంపేట(మెదక్): రామాయంపేటలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి విలువైన తమ భూములను బలవంతంగా లాక్కున్నారని బాధిత రైతులు వాపోయారు. ఈ మేరకు మంగళవారం బాధితులు స్థానిక మున్సిపల్ పాలకవర్గానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. 1421 సర్వే నంబర్‌లో 30 ఏళ్ల క్రితమే తమకు పట్టాలు ఇచ్చారని, ప్రస్తుతం సదరు భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన సముదాయం నిర్మాణం పేరిట అధికారులు ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ భూములను లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో స్కూల్ భవనాల నిర్మాణం కోసం అక్కడి అధికారులు రైతుల వద్ద భూములు సేకరించి, నష్టపరిహారం ఇప్పించారని, తమకు కూడా ఇప్పించాలని బాధి తులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై మెదక్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేస్తానని వైస్ చైర్మన్ నవనీత భరోసా ఇచ్చారు.
నవనీతకు వినతిపత్రం అందజేస్తున్న రైతులు


