సమస్యలతో సహవాసం | - | Sakshi
Sakshi News home page

సమస్యలతో సహవాసం

Apr 14 2026 8:28 AM | Updated on Apr 14 2026 8:28 AM

● నర్సింగ్‌ హాస్టల్‌లో సౌకర్యాలు నిల్‌ ● పట్టించుకోని అధికారులు ● ఆందోళనలో విద్యార్థినులు

● నర్సింగ్‌ హాస్టల్‌లో సౌకర్యాలు నిల్‌ ● పట్టించుకోని అధికారులు ● ఆందోళనలో విద్యార్థినులు

మెదక్‌జోన్‌: నర్సింగ్‌ విద్యార్థినులు ఏడాదిన్నరగా సమస్యలతో సతమతం అవుతున్నారు. 120 మంది ఉన్న ఆ వసతి గృహంలో కేవలం ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉంది. దీంతో విద్యార్థినుల బాధ వర్ణణాతీతం. మెయింటెనెన్స్‌ పేరుతో ప్రిన్సిపాల్‌ నెలనెలా డబ్బులు వసూలు చేస్తున్నారని, అయినా కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆవేదన చెందుతున్నారు.

120 మందికి ఒకే టాయిలెట్‌

జిల్లాకు ఏడాదిన్నర క్రితం మెడికల్‌తో పాటు నర్సింగ్‌ కళాశాల మంజూరు చేశారు. 120 మంది నర్సింగ్‌ విద్యార్థినుల కోసం పట్టణ పరిధిలోని పిల్లికొటాల్‌ సమీపంలో ఓ ప్రైవేట్‌ భవనాన్ని అద్దెకు తీసుకొని హాస్టల్‌ కొనసాగిస్తున్నారు. అయితే అందులో ఒకే ఒక్క టాయిలెట్‌ మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉందని, మిగితావి పనిచేయటం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒంటికి.. రెంటికి వస్తే ఆ బాధ నరకమంటున్నారు. బెడ్లు సైతం సరిపడా లేకపోవడంతో ఒక్కోదానిపై ఇద్దరు, ముగ్గరు నిద్రపోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భోజన ఫీజుతో పాటు మెయింటెనెన్స్‌ పేరుతో నెలనెలా డబ్బులు వసూలు చేస్తున్నారని, భోజనం సైతం సరిగా ఉండటం లేదని, పురుగులు పట్టిన కూరగాయలు, దొడ్డు బియ్యంతో భోజనం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ప్రిన్సిపాల్‌ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

మురికి కూపం..

వసతి గృహంలో డ్రైనేజీ పైపులైన్లు బ్లాక్‌ అయ్యాయి. వసతిగృహం ముందు నుంచే నీరంతా ప్రవహిస్తుండటంతో ఆ హాస్టల్‌ మురికి కూపంగా మారి దుర్గంధం వెదజల్లుతోంది. లోని కి వెళ్లాలంటే ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో ఈగలు, దోమలకు నిలయంగా మారి వ్యాధులు భారిన పడాల్సిన పరిస్థితి నెలకొందని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిన్నరగా కనీస సౌకర్యాలు లేవని, ప్రిన్సిపాల్‌తో పాటు జిల్లాస్థాయి అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఇటీవల కలెక్టరేట్‌లో ఆందోళనకు దిగారు.

Advertisement
 
Advertisement
Advertisement