అన్నదాతకు ఊరట | - | Sakshi
Sakshi News home page

అన్నదాతకు ఊరట

Apr 13 2026 8:08 AM | Updated on Apr 13 2026 8:08 AM

● ఎట్టకేలకు మంజూరు చేసిన ప్రభుత్వం ● ఎకరానికి 10,000 చొప్పున అందజేత

జిల్లాకు రూ.6.48 కోట్ల పంట నష్ట పరిహారం
● ఎట్టకేలకు మంజూరు చేసిన ప్రభుత్వం ● ఎకరానికి 10,000 చొప్పున అందజేత

రామాయంపేట(మెదక్‌): గతేడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఊరట కలిగించే విషయం చెప్పింది. జిల్లాకు రూ.6.48 కోట్ల పంట నష్టం పరిహారం మంజూరు చేసింది. గత ఎనిమిది నెలలుగా రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారికి త్వరలో ఎకరానికి 10,000 చొప్పున పరిహారం అందనుంది.

6,500 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

జిల్లావ్యాప్తంగా 8,089 మంది రైతులకు సంబంధించి మొత్తం 6,480 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. 1,060 ఎకరాల మేర పంట చేలల్లో ఇసుక మేటలు వేసింది. నెలల తరబడి పంట చేన్లు నీటిలోనే ఉండి రంగు మారి దెబ్బతిన్నాయి. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించి నష్టపోయిన పంటల వివరాలను రెండు విడతలుగా సేకరించి ప్రభుత్వానికి నివేదించారు. ప్రధానంగా వరి తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారుల సర్వేలో తేలింది. దీనికి తోడు పత్తి పంట కూడా దెబ్బతిని రైతులు పెట్టుబడులు సైతం నష్టపోయారు. మొక్కజొన్న చేతికి రాకుండా పోయింది. కోసి గూడు పెట్టిన కంకులు మొలకెత్తాయి. పంట రంగు మారి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాగా అప్పట్లో సీఎంతో పాటు మంత్రులు జిల్లాలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంట నష్టం పరిహారం అందజేస్తామని ప్రకటించారు. కాగా ఇసుక మేటలను ఈ సీజన్‌లో తొలగించుకోవడం సాధ్యం కాదని భావించిన రైతులు వాయిదా వేసుకున్నారు. ఎనిమిది నెలలు గడిచినా ఇంకా ఇసుక మేటలు తొలగిపోలేదు. రామాయంపేట, నార్సింగి, హవేళిఘణాపూర్‌ మండలాల్లో మొదటి విడతగా 11 ఎకరాల్లో మాత్రమే ఇసుక మేటలు తొలగించారు.

జిల్లాలో దెబ్బతిన్న పంటలు ఇలా..

పంట ఎకరాలు

వరి 5,850

పత్తి 475

పెసర 69

మొక్కజొన్న 25

కూరగాయలు, ఇతర పంటలు 90

త్వరలో అందజేస్తాం

గతేడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటల వివరాలు ప్రభుత్వానికి నివేదించాం. నష్ట పరిహారానికి సంబంధించి ప్రభు త్వం నిధులు విడుదల చేసినట్లు తెలిసింది. ఇంకా జిల్లాకు అందలేదు. రాగానే బాధిత రైతుల ఖాతాల్లో జమ చేస్తాం.

– దేవ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement